
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బాబ్ కౌపర్ (Bob Cowper) కన్నుమూశారు. 84 ఏళ్ల వయసులో మెల్‌బోర్న్‌లో తుదిశ్వాస విడిచారు. క్యాన్సర్‌తో చాలా ఏళ్లుగా పోరాడుతున్న ఆయన శనివారం తనువు చాలించారు.
టెస్టుల్లో ‘తొలి’ ట్రిపుల్ సెంచరీ..
కాగా ఆస్ట్రేలియా గడ్డ మీద టెస్టుల్లో మొట్టమొదటి త్రిశతకం బాదిన క్రికెటర్‌గా కౌపర్ చరిత్రకెక్కారు. ఇంగ్లండ్‌తో 1966 నాటి మెల్‌బోర్న్ టెస్టులో కౌపర్ 307 పరుగులతో సత్తా చాటారు. తద్వారా ఈ మేర అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకోవడంతో పాటు.. ఆస్ట్రేలియా యాషెస్ సిరీస్‌ను నిలబెట్టుకోవడంలో కీలక పాత్ర పోషించారు.
నాలుగేళ్లకే
ఇక 1964- 1968 మధ్య తన కెరీర్‌లో మొత్తంగా 27 టెస్టు మ్యాచ్‌లు ఆడిన బాబ్ కౌపర్.. 46.84 సగటుతో 2061 పరుగులు సాధించారు. ఇందులో ఐదు శతకాలు ఉన్నాయి. అంతేకాదు పార్ట్‌టైమ్ స్పిన్నర్‌గా రాణించి 36 వికెట్లు కూడా పడగొట్టారు. అయితే, కెరీర్ మొదలుపెట్టిన నాలుగేళ్లకే కౌపర్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.
కేవలం 28 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌కు కౌపర్ వీడ్కోలు పలికారు. వ్యాపార రంగంలో రాణించే నిమిత్తం ఈ మేర తన నిర్ణయాన్ని వెల్లడించారు. ఇక దేశీ క్రికెట్‌లో విక్టోరియా తరఫున బాబ్ కౌపర్.. 83 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడారు.
ఐసీసీ మ్యాచ్ రిఫరీగానూ
అదే విధంగా.. ఆటగాడిగా రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత.. 1987 నుంచి 2001 వరకు ఐసీసీ మ్యాచ్ రిఫరీగానూ కౌపర్ సేవలు అందించారు. ఆయన సేవలకు గుర్తింపుగా 2023లో ‘ది ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా’ పురస్కారం అందుకున్నారు.
క్రికెట్ ఆస్ట్రేలియా సంతాపం
కాగా బాబ్ కౌపర్ మరణం పట్ల క్రికెట్ ఆస్ట్రేలియా సంతాపం ప్రకటించింది. ‘‘బాబ్ కౌపర్ మృతి చెందారన్న వార్త మమ్మల్ని విషాదంలోకి నెట్టివేసింది. ఆస్ట్రేలియా క్రికెట్‌లో ఆయనొక గౌరవప్రదమైన వ్యక్తి.
అత్యద్భుతమైన బ్యాటర్. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో బాబ్ చేసిన ట్రిపుల్ సెంచరీ చిరస్థాయిగా నిలిచిపోతుంది. 1960వ దశకంలో ఆస్ట్రేలియన్, విక్టోరియన్ జట్ల మీద ఆయన ఎంతగానో ప్రభావం చూపారు.
ఆటగాడిగానే కాకుండా ఐసీసీ మ్యాచ్ రిఫరీ గానూ సేవలు అందించారు. క్రికెట్ ఆస్ట్రేలియా తరఫున బాబ్ కుటుంబానికి, స్నేహితులు, సహచర ఆటగాళ్లకు మా ప్రగాఢ సానుభూతి’’ అని క్రికెట్ ఆస్ట్రేలియా చైర్మన్ మైక్ బైర్డ్ ప్రకటన విడుదల చేశాడు. కాగా బాబ్ కౌపర్‌కు భార్య డేల్, కుమార్తెలు ఒలీవియా, సెరా ఉన్నారు.
చదవండి: క్రికెట్ చరిత్రలో తొలిసారి.. ఒకే ఇన్నింగ్స్‌లో 10 మంది రిటైర్డ్ ఔట్