
అంతర్జాతీయ క్రికెట్ అయినా, దేశవాళీ క్రికెట్ అయినా ప్లేయర్ 'రిటైర్డ్ ఔట్' అనేది చాలా అరుదుగా చూస్తూ ఉంటాము. కానీ ఓ మ్యాచ్‌లో మొత్తం పది మంది బ్యాటర్లు 'రిటైర్డ్ ఔట్ రూపంలో పెవిలియన్‌కు చేరారు. అవును మీరు విన్నది నిజమే. అసలు విషయం తెలియాలంటే ఈ కథనం పూర్తిగా చదవాల్సిందే.
మహిళల టీ20 ప్రపంచకప్-2025లో భాగంగా బ్యాంకాక్ వేదికగా శనివారం యూఏఈ, ఖతార్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన యూఏఈ మహిళల జట్టు 16 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 192 పరుగులు చేశారు. ఇక్కడే యూఏఈ క్రికెట్ టీమ్ సంచలన నిర్ణయం తీసుకుంది.
బ్యాంకాక్‌లో వర్షం పడే అవకాశం ఉన్నందున యూఏఈ తమ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయాలని నిర్ణయించుకుంది. కానీ టీ20ల్లో డిక్లరేషన్ రూల్ లేకపోవడంతో, యూఏఈ మెనెజ్‌మెంట్ తమ బ్యాటర్లందరిని మైదానంలోకి పిలిచి రిటైర్డ్ ఔట్ చేయాలని నిర్ణయించుకుంది.
దీంతో క్రికెట్ చరిత్రలోనే తొలిసారిగా మొత్తం పది మంది బ్యాటర్లు రిటైర్డ్ ఔటయ్యారు. ఈ మ్యాచ్‌కు సంబంధించిన స్కోర్ కార్డు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న యుఏఈ కెప్టెన్, మేనేజ్‌మెంట్‌పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురుస్తున్నారు.
అనంతరం 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఖతార్ కేవలం 29 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఖతార్‌పై 163 పరుగల తేడాతో యూఏఈ విజయం సాధించింది.
చదవండి: #Rohit Sharma: సోషల్ మీడియాలోనే రిటైర్మెంట్.. రోహిత్‌ను ఇలాగే పంపిస్తారా?