త్వరలో (అక్టోబర్ 22 నుండి డిసెంబర్ 1) న్యూజిలాండ్‌లో జరుగబోయే మల్టీ ఫార్మాట్ సిరీస్‌కు ముందు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక ప్రణాళికను సిద్ధం చేసింది. సీనియర్ జట్టు పర్యటనకు ముందే 'ఏ' జట్టును న్యూజిలాండ్‌కు పంపించాలని నిర్ణయించింది. 'ఏ' జట్టులో కొందరు కీలక టెస్టు జట్టు సభ్యులను ఎంపిక చేస్తారని తెలుస్తోంది. వారికి న్యూజిలాండ్ పరిస్థితుల్లో వీలైనంత మ్యాచ్ ప్రాక్టీస్ అందించాలన్నదే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం.
ప్రస్తుతం భారత టెస్టు బ్యాటర్లలో రిషభ్ పంత్ మినహా శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్ తదితరులు న్యూజిలాండ్‌లో టెస్టు అనుభవం చాలా తక్కువగా లేదా అసలు లేదు. అక్కడ స్వింగ్, సీమ్‌కు అనుకూలించే పిచ్‌లపై ముందుగానే ఆడడం ద్వారా వారు పరిస్థితులను అర్థం చేసుకుని మెరుగైన ప్రదర్శన చేసే అవకాశం ఉంటుంది.
న్యూజిలాండ్ పిచ్‌లపై బంతి ఎక్కువగా స్వింగ్ అవుతుండటంతో విదేశీ బ్యాటర్లకు పరుగులు చేయడం ఎప్పుడూ సవాలుగానే ఉంటుంది. అందుకే సీనియర్ ఆటగాళ్లను కూడా ఇండియా-ఏ జట్టులో చేర్చి ముందుగానే అక్కడికి పంపాలని బీసీసీఐ యోచిస్తోంది. ఈ పర్యటనలో ఇండియా-ఏ జట్టు మూడు లిస్ట్-ఏ మ్యాచ్‌లు, రెండు ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడనున్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే, భారత్-న్యూజిలాండ్ మధ్య ఐదు టీ20లు, ఐదు వన్డేలు, రెండు టెస్టులతో కూడిన మల్టీ ఫార్మాట్ సిరీస్ జరగనుంది. ఇందులో వన్డే సిరీస్ 2027 ప్రపంచకప్‌కు జట్టు కూర్పును ఖరారు చేయడంలో ఉపయోగపడనుండగా, రెండు టెస్టులు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (WTC) 2025-27 ఫైనల్ అవకాశాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది.


