
అంతా ఊహించిందే జరిగింది. బంగ్లాదేశ్‌లో భారత జట్టు పర్యటన వాయిదా పడింది. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) శనివారం ధ్రువీకరించింది. ఇరు బోర్డుల అంగీకారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ తెలిపింది. అంతర్జాతీయ క్రికెట్ కమిట్‌మెంట్స్, రెండు జట్ల షెడ్యూల్‌ను పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నాము.
ఈ సిరీస్‌ను వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో నిర్వహించేందుకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఆతృతగా ఎదురుచూస్తోంది. ఈ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్, పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని భారత క్రికెట్ బోర్డు ఓ ప్రకటనలో పేర్కొంది.
వాయిదా ఎందుకంటే?
కాగా ఈ ఏడాది ఆరంభం నుంచే బంగ్లా-భారత్ వైట్‌బాల్ సిరీస్‌లపై నీలినీడలు కమ్ముకున్నాయి. బంగ్లా పర్యటనకు భారత జట్టును పంపేందుకు బీసీసీఐ ప్రభుత్వ అనుమతి కోసం ఎదురు చూసింది. కానీ భద్రతా కారణాల దృష్ట్యా ఈ పర్యటనను వాయిదా వేసుకోమని భారత ప్రభుత్వం బీసీసీఐని సూచించినట్లు తెలుస్తోంది.
మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వం కూలాక అక్కడ చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలతో బంగ్లాదేశ్ అట్టుడికింది. ప్రస్తుతం తాత్కాళిక ప్రభుత్వ ఏర్పాటుతో పరిస్థితులు అదుపులో ఉన్నట్లు కనబడుతున్నప్పటికీ, నివురుగప్పిన నిప్పులా మళ్లీ ఉద్రిక్తతలు తలెత్తితే ఛాన్స్ ఉంది. అంతకుతోడు బంగ్లాదేశ్ మాజీ మంత్రులు, రాజకీయ నేతలపై అక్కడ తరచూ మూకదాడులు జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
వచ్చే ఏడాదికల్లా ఎన్నికలు పూర్తయితే పరిస్థితిలో మార్పుంటుందని బోర్డు భావిస్తోంది. వీటిన్నంటిని పరిగణలోకి తీసుకునే ఈ పర్యటను బీసీసీఐ వాయిదా వేసింది. షెడ్యూల్ ప్రకారం.. భారత జట్టు ఆతిథ్య బంగ్లాతో వచ్చేనెల 17 నుంచి 31 వరకు చిట్టగాంగ్, ఢాకా వేదికలపై మూడేసి చొప్పున వన్డేలు, టి20లు ఆడాల్సి ఉంది.
రోహిత్-కోహ్లి ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్..
మరోవైపు తమ ఆరాధ్య క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలను మైదానంలో చూడాలన్న ఆశపడ్డ అభిమానులు మరి కొన్న నెలలు వేచి చూడాల్సిందే. టెస్టు, టీ20లకు ప్రకటించిన రోహిత్, కోహ్లి కేవలం వన్డేల్లో మాత్రమే ఆడనున్నారు. ఈ క్రమంలో బంగ్లాతో జరిగే వన్డే సిరీస్‌లో వీరిద్దరని చూడవచ్చని అంతా భావించారు. కానీ ఇప్పుడు టూర్ వాయిదా పడడంతో ఫ్యాన్స్‌కు నిరాశే ఎదురైంది. ఈ ఏడాది ఆక్టోబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్‌లో రో-కో ద్వయం ఆడనున్నారు.
చదవండి: సునామీ శతకంతో విరుచుకుపడ్డ వైభవ్ సూర్యవంశీ.. ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన భారత్