Womens Asia Cup 2023: ఆసియాకప్‌కు భారత జట్టు ప్రకటన.. పాకిస్తాన్‌తో మ్యాచ్‌ ఎప్పుడంటే?

BCCI announces India A squad for Emerging Womens Asia Cup 2023 - Sakshi

హాంకాంగ్‌ వేదికగా జరగనున్న ఏసీసీ ఎమర్జింగ్ ఉమెన్స్ ఆసియా కప్- 2023కు భారత-ఏ జట్టును బీసీసీఐ శుక్రవారం ప్రకటించింది. ఈ మెగా ఈవెంట్‌కు 14 మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ ఎంపికచేసింది. ఈ జట్టుకు అండర్‌-19 స్టార్ క్రికెటర్‌ శ్వేతా సెహ్రావత్ నాయకత్వం వహించనుంది. అదే విధంగా ఈ జట్టులో తెలుగు రాష్ట్రాలకు చెందిన యువ క్రికెటర్లు  గొంగడి త్రిషా, బారెడ్డి మల్లి అనూషకు చోటు దక్కింది.

తెలంగాణకు చెందిన యువ సంచలనం గొంగడి త్రిషా ఇప్పటికే భారత అండర్‌-19 జట్టు తరపున ఆడిన విషయం తెలిసిందే. మరోవైపు ఆంధ్రాకు చెందిన యువ పేసర్‌ బారెడ్డి మల్లి అనూష అండర్‌-16 టోర్నీలో అద్భుతంగా రాణించడంతో ఈ మెగా ఈవెంట్‌కు ఎంపికైంది. ఇక ఈ మెగా టోర్నీ జూన్‌-12 నుంచి షురూ కానుంది. ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు భాగం కానున్నాయి.

ఈ 8 జట్లను ఏ, బి అని రెండు గ్రూపులుగా విభజించారు. ఇందులో భారత జట్టు గ్రూపు-ఏలో ఉంది. భారత్‌తో పాటు హాంకాంగ్, థాయిలాండ్ ‘ఎ’ మరియు పాకిస్తాన్ ‘ఎ’ వంటి జట్లు ఉన్నాయి. ఇక జూన్‌ 13న క్వాంగ్ రోడ్ రిక్రియేషన్ గ్రౌండ్‌ వేదికగా భారత జట్టు తమ తొలి మ్యాచ్‌లో హాంకాంగ్‌తో తలపడనుంది. అదే విధంగా పాకిస్తాన్‌-ఏ జట్టుతో జూన్‌ 17న భారత్‌ ఆడనుంది.

ఇండియా ఎమర్జింగ్-ఏ జట్టు: శ్వేతా సెహ్రావత్ (కెప్టెన్), సౌమ్య తివారీ (వైస్ కెప్టెన్), త్రిషా గొంగడి, ముస్కాన్ మాలిక్, శ్రేయాంక పాటిల్, కనికా అహుజా, ఉమా చెత్రీ (వికెట్ కీపర్), మమత మడివాలా (వికెట్ కీపర్), యశశ్రీ ఎస్, కష్వీ గౌతమ్, పార్షవి చోప్రా, మన్నత్ కశ్యప్, బి అనూష
చదవండి: వరల్డ్‌కప్‌కు ముందు టీమిండియాకు మరో గుడ్‌ న్యూస్‌.. అతడు కూడా వచ్చేస్తున్నాడు!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top