Axar Patel Reached Fifty-Mark By Hitting Sixer IND Vs AUS 2nd Test - Sakshi
Sakshi News home page

Axar Patel: సిక్సర్‌తో ఫిఫ్టీ.. పూర్తిస్థాయి బ్యాటర్‌గా మారిపోయాడు

Published Sat, Feb 18 2023 3:42 PM

Axar Patel Reached Fifty-Mark By Hitting Sixer IND Vs AUS 2nd Test - Sakshi

ఢిల్లీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ మరోసారి ఆపద్భాంధవుడయ్యాడు. టాపార్డర్‌, మిడిలార్డర్‌ విఫలమైన వేళ తానున్నాంటూ మరోసారి టీమిండియాను ఆదుకున్నాడు. ఈ క్రమంలోనే అక్షర్‌ పటేల్‌ టెస్టులో మరో అర్థసెంచరీ నమోదు చేశాడు. బ్యాటర్లంతా విఫలమైన చోట అక్షర్‌ 95 బంతుల్లో అర్థసెంచరీ మార్క్‌ సాధించాడు. అతని ఇన్నింగ్స్‌లో ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. 

తన స్కోరు 44 పరుగుల వద్ద ఉన్నప్పుడు అక్షర్‌ కుహ్నేమన్‌ బౌలింగ్‌లో సిక్సర్‌ బాది అర్థసెంచరీ మార్క్‌ను అందుకోవడం విశేషం. తొలి టెస్టులోనూ టీమిండియాకు ఇదే పరిస్థితి ఎదురైనప్పుడు అక్షర్‌ పటేల్‌  84 పరుగుల అద్భుత ఇన్నింగ్స్‌ ఆడాడు. జడేజాతో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. టీమిండియా 400 పరుగులు దాటగిలిగిందంటే అదంతా అక్షర్‌ పటేల్‌, జడేజాల చలువే. ఆ తర్వాత అశ్విన్‌, జడ్డూ స్పిన్‌ మాయాజాలంతో టీమిండియా ఘన విజయం సాధించింది. బౌలింగ్‌లో విఫలమైనా బ్యాటింగ్‌లో మెరిసి జట్టు విజయంలో అక్షర్‌ పటేల్‌ తన వంతు పాత్ర పోషించాడు. 

అయితే కెరీర్‌ మొదట్లో అక్షర్‌ పటేల్‌ కేవలం బౌలింగ్‌కే పరిమితమయ్యాడు. ఆ తర్వాత లోయర్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌ చేస్తూ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌గా మారిపోయాడు. అయితే తాజాగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో మాత్రం అక్షర్‌ పటేల్‌లో పూర్తిస్థాయి బ్యాటర్‌ కనిపిస్తున్నాడు. బ్యాటర్లంతా విఫలమైన చోట ఆసీస్‌ బౌలర్లను పరీక్షిస్తూ బ్యాటింగ్‌ కొనసాగించిన అక్షర్‌ ఇన్నింగ్స్‌కు హ్యాట్సాఫ్‌ చెప్పాల్సిందే. అయితే మూడో స్పిన్నర్‌గా జట్టులో ఉన్న అక్షర్‌ పటేల్‌కు బౌలింగ్‌లో ఒక్క వికెట్‌ కూడా దక్కడం లేదు.

అశ్విన్‌, జడేజాలు ప్రభావం చూపిస్తున్న చోట అక్షర్‌ మాత్రం తన బౌలింగ్‌ పదును చూపించడంలో విఫలమవుతున్నాడు. అక్షర్‌ పటేల్‌ లెఫ్టార్మ్‌ బౌలర్‌.. జడేజా కూడా లెఫ్టార్మ్‌ బౌలరే.. మరి జడ్డూ వికెట్లు తీస్తుంటే అక్షర్‌ మాత్రం ఎందుకు తీయలేకపోతున్నాడనేది ఆశ్చర్యకరంగా మారింది. అయితే బౌలింగ్‌లో విఫలమైనప్పటికి బ్యాటర్‌గా రాణిస్తుండడంతో అక్షర్‌ పటేల్‌ స్థానం జట్టులో ప్రస్తుతానికి పదిలంగానే కనిపిస్తుంది. కానీ మూడో స్పిన్నర్‌ ప్రభావం చూపాలని జట్టు మేనేజ్‌మెంట్‌ యోచన చేస్తే మాత్రం అక్షర్‌ పటేల్‌పై వేటు పడే అవకాశం ఉంది. 

చదవండి: IND VS AUS 2nd Test Day 2: అశ్విన్‌ ఖాతాలో అరుదైన రికార్డు

Advertisement

తప్పక చదవండి

Advertisement