IND VS AUS 2nd Test Day 2: అశ్విన్‌ ఖాతాలో అరుదైన రికార్డు

Ashwin Becomes 5th Player To Score 5000 Runs, 700 Wickets - Sakshi

Ravichandran Ashwin: టీమిండియా వెటరన్‌ ఆల్‌రౌండర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ అరుదైన రికార్డు నెలకొల్పాడు. న్యూఢిల్లీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగతున్న రెండో టెస్ట్‌లో కష్టాల్లో ఉన్న టీమిండియాను బ్యాట్‌తో ఆదుకున్న యాష్‌ (32 నాటౌట్‌) ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో 5000 అంతకంటే ఎక్కువ పరుగులు, 700 అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టిన ఐదవ భారత ఆల్‌రౌండర్‌గా రికార్డుల్లోకెక్కాడు. యాష్‌కు ముందు వినూ మన్కడ్‌ (11591 పరుగులు, 782 వికెట్లు), శ్రీనివాస్‌ వెంకట రాఘవన​ (6617 రన్స్‌, 1390 వికెట్లు), కపిల్‌ దేవ్‌ (11356, 835), అనిల్‌ కుంబ్లే (5572, 1136) ఈ ఘనత సాధించారు. 

ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో కష్టాల్లో ఉండిన టీమిండియాను అశ్విన్‌ (32 నాటౌట్‌), అక్షర్‌ పటేల్‌ (51 నాటౌట్‌) ఆదుకున్నారు. వీరిద్దరు ఎనిమిదో వికెట్‌కు అజేయమైన 92 పరుగులు జోడించి ఇంకా క్రీజ్‌లో ఉన్నారు. 77 ఓవర్ల తర్వాత తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా స్కోర్‌ 231/7గా ఉంది. ఆశ్విన్‌ ఆచితూచి ఆడుతుంటే.. అక్షర్‌ మాత్రం బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడుతున్నారు. అక్షర్‌ సిక్సర్‌తోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. అక్షర్‌ 6 ఫోర్లు, 2 భారీ సిక్సర్లు బాదగా.. అశ్విన్‌ 4 ఫోర్లు కొట్టాడు. టీమిండియా ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌ సోకర్‌కు ఇంకా 32 పరుగులు వెనుకబడి ఉంది.

అక్షర్‌-అశ్విన్‌ జోడీకి ముందు కోహ్లి-జడేజా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అయితే 10 పరుగుల వ్యవధిలో వీరిద్దరు ఔట్‌ కావడంతో టీమిండియా కష్టాల్లో పడింది. కోహ్లి (44) అంపైర్‌ వివాదాస్పద నిర్ణయానికి బలి కాగా.. జడేజా (26) మర్ఫీకి వికెట్ల ముందు దొరికిపోయాడు. ఆసీస్‌ బౌలర్లలో లియోన్‌ 5 వికెట్లు పడగొట్టగా.. టాడ్‌ మర్ఫీ, మాథ్యూ కున్నేమన్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు.

లియోన్‌.. కేఎల్‌ రాహుల్‌ (17), రోహిత్‌ శర్మ (32), పుజారా (0), శ్రేయస్‌ అయ్యర్‌ (4), శ్రీకర్‌ భరత్‌ (6)లను పెవిలియన్‌కు పంపాడు. అంతకుముందు ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఖ్వాజా (81), హ్యాండ్స్‌కోంబ్‌ (72) అర్ధసెంచరీలతో రాణించగా.. టీమిండియా బౌలర్లు షమీ 4, అశ్విన్‌, జడేజా చెరో 3 వికెట్లు పడగొట్టారు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top