
ఆంధ్ర ప్రీమియర్ లీగ్ 2025 ఎడిషన్‌కు మెరుపు ఆరంభం లభించింది. నిన్న (ఆగస్ట్ 9) విజయవాడ సన్‌షైనర్స్, రాయల్స్ ఆఫ్ రాయలసీమ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 32 సిక్సర్లు నమోదయ్యాయి.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాయలసీమ రాయల్స్.. పైలా అవినాశ్ (39 బంతుల్లో 96; 4 ఫోర్లు, 11 సిక్సర్లు), గిరినాథ్ రెడ్డి (23 బంతుల్లో 49 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) సిక్సర్ల వర్షం కురిపించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 196 పరుగుల భారీ స్కోర్ చేసింది.
రాయలసీమ ఇన్నింగ్స్‌లో ధృవ కుమార్ రెడ్డి 10 (సిక్స్), షేక్ రషీద్ 18 (4 ఫోర్లు), మద్దిల వర్దన్ 1, వాసు దేవరాజు 14, సత్య సాయి సాత్విక్ 2, సాయి ప్రణవ్ చంద్ర 1, జాగర్లపూడి రామ్ 0 (నాటౌట్) పరుగులు చేశారు. విజయవాడ బౌలర్లలో ఎల్ మోహన్, నరసింహ రాజు తలో 2 వికెట్లు పడగొట్టగా.. పృథ్వీ రాజ్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.
అనంతరం బరిలోకి దిగిన విజయవాడ సన్‌షైనర్స్.. కెప్టెన్ అశ్విన్ హెబ్బర్ (48 బంతుల్లో 98; 6 ఫోర్లు, 9 సిక్సర్లు), గరిమెల్ల తేజ (37 బంతుల్లో 77; 7 ఫోర్లు, 6 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడటంతో మరో 19 బంతులు మిగిలుండగానే కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
విజయవాడ ఇన్నింగ్స్‌లో మామిడి వంశీకృష్ణ 16, మున్నంగి అభినవ్ 0, ధీరజ్ కుమార్ 4 (నాటౌట్) పరుగులు చేశారు. రాయలసీమ బౌలరల్లో జాగర్లమూడి రామ్ 3 వికెట్లు పడగొట్టాడు.