
దిగ్గజ ఆల్‌రౌండర్, మాజీ ఇంగ్లండ్ ప్లేయర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ (Andrew Flintoff) సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) (ఐపీఎల్) సిస్టర్ ఫ్రాంచైజీ అయిన నార్త్రన్ సూపర్ ఛార్జర్స్‌తో (ద హండ్రెడ్ లీగ్) బంధాన్ని తెంచుకున్నాడు. గత రెండు సీజన్లుగా సూపర్ ఛార్జర్స్ హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న ఫ్లింటాఫ్.. యాజమాన్యంతో విభేదాల కారణంగా పదవి నుంచి వైదొలిగాడు.
సూపర్ ఛార్జర్స్ యాజమాన్యానికి ఫ్లింటాఫ్‌కు పారితోషికం విషయంలో గొడవ జరిగినట్లు తెలుస్తుంది. సన్‌రైజర్స్ యాజమాన్యం సూపర్ ఛార్జర్స్‌ను ఓవర్‌టేక్ చేశాక ఫ్లింటాఫ్‌కు జీతం పెంచుతామని మాట ఇచ్చారట. అయితే ఈ పెంపు నామమాత్రంగా ఉండటంతో ఫ్లింటాఫ్ అసంతృప్తిగా ఉన్నాడు. ఈ విషయాన్ని యాజమాన్యం వద్ద ప్రస్తావించినా పెద్దగా పట్టించుకోకపోవడడంతో కోచ్ పదవికి రాజీనామా చేశాడు.
సూపర్ ఛార్జర్స్ ఆఫర్ చేసే దానికంటే నా సేవలకు చాలా విలువైనవని ఫ్రాంచైజీని వీడాక ఫ్లింటాఫ్ అన్నాడు. 47 ఏళ్ల ఫ్లింటాఫ్ గత రెండు సీజన్లలో నార్త్రన్ సూపర్ ఛార్జర్స్‌కు హెడ్ కోచ్‌గా పని చేశాడు. ఈ రెండు సీజన్లను ఆ జట్టు నాలుగు, మూడు స్థానాలతో ముగించింది.
కాగా, సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యమైన సన్ గ్రూప్ ఈ ఏడాదే నార్త్రన్ సూపర్ ఛార్జర్స్ ఫ్రాంచైజీని పూర్తిగా సొంతం చేసుకుంది. ఈ ఫ్రాంచైజీలో 100 శాతం వాటా హక్కులను కావ్యా మారన్ (Kavya Maran) నేతృత్వంలోని సన్ గ్రూప్ దక్కించుకుంది. సన్ గ్రూప్‌కు ఐపీఎల్, హండ్రెడ్ లీగ్‌ల్లోనే కాకుండా సౌతాఫ్రికా టీ20 లీగ్‌లోనూ ఓ ఫ్రాంచైజీ ఉంది. దాని పేరు సన్‌రైజర్స్ ఈస్ట్రన్ కేప్.
ఫ్లింటాఫ్‌కు కొత్త ఆఫర్లు..?
నార్త్రన్ సూపర్ ఛార్జర్స్ హెడ్ కోచ్ పదవి నుంచి వైదొలిగిన ఫ్లింటాఫ్‌కు త్వరలో కొత్త ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం హండ్రెడ్ లీగ్‌లోని మాంచెస్టర్ ఒరిజినల్స్ (త్వరలో మాంచెస్టర్ సూపర్‌జెయింట్స్), ట్రెంట్ రాకెట్స్ జట్లకు హెడ్ కోచ్‌లు లేరు. ఈ రెండిటిలో ఏదో ఒక ఫ్రాంచైజీ ఫ్లింటాఫ్‌కు కోచ్ పదవి ఆఫర్ చేసే అవకాశం ఉంది.