
అదరగొట్టిన ఆటగాళ్లు
రిటైన్‌లో రికీబుయ్.. వేలంలో అవినాశ్
ఏపీఎల్‌లో రిటైన్ కంటే వేలంలోనే ఎక్కువ ధర పలికిన ఆటగాళ్లు
విశాఖ స్పోర్ట్స్: ఏపీఎల్ నాలుగో సీజన్‌లో తలపడే జట్ల ఆటగాళ్ల వేలంలో ఫ్రాంచైజీలు రిటైన్ ఆటగాళ్ల కంటే గ్రేడ్ ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు అత్యధిక మొత్తాల్ని వెచ్చించాయి. 520 మంది ఆటగాళ్లను వారి స్థాయిని బట్టి నాలుగు కేటగిరిల్లో ఉంచారు. అంతర్జాతీయ, ఐపీఎల్‌లో ఆడిన ఆటగాళ్లను ప్రత్యేక కేటగిరిగా తొమ్మిది మందిని ఉంచగా వారిలో ఎనిమిది మందిని ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకున్నాయి. ఇలా రిటైన్ చేసుకున్న ఆటగాళ్లలో రికీబుయ్‌కి అత్యధికంగా రూ.10.26 లక్షలు ఇచ్చారు. అయితే వేలంలో ఆల్‌రౌండర్లను దక్కించుకునే యత్నంలో ఫ్రాంచైజీలు రిటైన్ ఆటగాళ్లకంటే ఎక్కువ మొత్తాల్ని మిగతా గ్రూపుల ఆటగాళ్లకు వెచ్చించారు.
అవినాశ్‌కు అత్యధికంగా రూ.11.05 లక్షలు
పి.అవినాశ్ ఏకంగా 11.05 లక్షలు ధర పలికాడు. మార్కీ ఆటగాళ్ల కేటగిరిలో ఉన్న హనుమ విహారీని అమరావతి రాయల్స్, అశ్విన్ హెబ్బర్‌ను విజయవాడ సన్‌షైనర్స్, షేక్ రషీద్‌ను రాయల్స్ రాయలసీమ, కె.ఎస్.భరత్‌ను కాకినాడ కింగ్స్, నితీశ్ కుమార్‌ను భీమవరం బుల్స్ జట్లు పదేసి లక్షలతో వేలానికి ముందే దక్కించుకోగా సిహెచ్ స్టీఫెన్‌ను ఏడులక్షలకు, కేవి శశికాంత్‌ను ఐదు లక్షలకు తుంగభద్ర వారియర్స్ దక్కించుకుంది. ఇక ఈ కేటగిరిలో రికీబుయ్‌ను అత్యధిక ధరతో సింహాద్రి వైజాగ్ లయన్స్ దక్కించుకుంది. మార్కీ ప్లేయర్లగా ఏ గ్రేడ్‌లో ఉన్న అవినాశ్‌ను రూ.11.05 లక్షల అత్యధిక ధరతో రాయల్స్ రాయలసీమ దక్కించుకోగా పివి సత్యనారాయణ రాజును రూ.9.8 లక్షలకు భీమవరం బుల్స్, టి.విజయ్‌ను 7.55 లక్షలకు సింహాద్రి వైజాగ్ లయన్స్ వేలంలో దక్కించుకున్నాయి.
ఆగస్టు 8 నుంచి 23వరకు నాలుగో సీజన్
ఏపీఎల్ నాలుగో సీజన్ ఆగస్టు 8వ తేదీ నుంచి 23 వరకు వైఎస్‌ఆర్ ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో జరగనుంది. ఈసారి నాలుగు ప్లేఆఫ్ మ్యాచ్‌లతో పాటు మొత్తంగా 25 మ్యాచ్‌లు జరగనుండగా ఏడు జట్లు టైటిల్ కోసం పోటీపడనున్నాయి.