
ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. తొలిసారి తమ జట్టుకు ఓ విదేశీయుడిని హెడ్ కోచ్‌గా నియమించింది. 2025-26 సీజన్‌కు పురుషుల సీనియర్ జట్టు హెడ్ కోచ్‌గా న్యూజిలాండ్‌కు చెందిన గ్యారీ స్టెడ్ ఎంపిక చేయబడ్డాడు. స్టెడ్ 2021లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ గెలిచిన న్యూజిలాండ్‌కు హెడ్ కోచ్‌గా పని చేశాడు. ఆ ఎడిషన్ ఫైనల్లో న్యూజిలాండ్ భారత్‌ను ఓడించి టెస్ట్ ఛాంపియన్‌గా అవతరించింది.
53 ఏళ్ల స్టెడ్ తన కోచింగ్ ప్రయాణంలో న్యూజిలాండ్‌ను వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌తో పాటు 2019 వన్డే వరల్డ్‌కప్, 2021 టీ20 వరల్డ్‌కప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్స్‌కు చేర్చాడు. స్టెడ్ ఆథ్వర్యంలో న్యూజిలాండ్ గతేడాది భారత్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. 268 అంతర్జాతీయ మ్యాచ్‌లకు కోచ్‌గా వ్యవహరించిన స్టెడ్.. ఆంధ్ర క్రికెట్‌ను ఏమేరకు ముందుకు తీసుకెళ్తాడో చూడాలి.
ఏసీఏలో భాగం కావడంపై స్టెడ్ స్పందిస్తూ.. ఇక్కడి క్రికెట్ పట్ల ఉన్న అభిమానం అద్భుతంగా ఉంది. ACA అభివృద్ధి పట్ల చూపుతున్న నిబద్ధత నాకు ఎంతో ప్రేరణనిచ్చింది. ఆటగాళ్లతో కలిసి పని చేయడం కోసం ఎదురు చూస్తున్నానని అన్నాడు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌కు పని చేయనున్న తొలి విదేశీ కోచ్ స్టెడ్.
గతంలో చాలామంది ఫారిన్ కోచ్‌లు భారత దేశవాలీ జట్టకు కోచ్‌లుగా వ్యవహరించారు. మైఖేల్ బెవాన్ ఒడిషాకు, లాన్స్ క్లూసెనర్ త్రిపురకు, డేవ్ వాట్‌మోర్ కేరళ, బరోడా జట్లకు.. ఇంతికాబ్ ఆలం పంజాబ్‌కు, డారెన్ హోల్డర్, షాన్ విలియమ్స్, డెర్మాట్ రీవ్ మహారాష్ట్ర జట్టుకు వేర్వేరే దఫాల్లో కోచ్‌లుగా పని చేశారు.