
ఐపీఎల్‌లో రికార్డు సెంచరీతో చెలరేగిన 'సిక్సర పిడుగు' వైభవ్ సూర్యవంశీపై శుబ్‌మన్ గిల్ చేసిన వ్యాఖ్యల పట్ల మాజీ క్రికెటర్ అజయ్ జడేజా అసంతృప్తి వ్యక్తం చేశాడు. అతడు అలా మాట్లాడి ఉండాల్సి కాదని పరోక్షంగా కౌంటర్ ఇచ్చాడు. జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో సోమవారం రాత్రి గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టీనేజీ సంచలనం సూర్యవంశీ (14) సూపర్ సెంచరీతో రాజస్తాన్ రాయల్స్‌కు ఘన విజయం అందించాడు. దీంతో క్రికెట్ ప్రపంచంలో అతడి పేరు మార్మోగిపోతోంది. ఈ రోజు ఆ 14 ఏళ్ల ఈ కుర్రాడి గురించే అంతా మాట్లాడుకుంటున్నారు.
మ్యాచ్ ముగిసిన తర్వాత శుబ్‌మన్ గిల్ (Shubman Gill) మాట్లాడుతూ.. సూర్యవంశీకి అదృష్టం కలిసి వచ్చిందన్నట్టుగా వ్యాఖ్యానించాడు. తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నాడని కామెంట్ చేశాడు. "ఇది అతడి (అదృష్ట) రోజు. అద్భుతంగా హిట్టింగ్ చేశాడు. అతడు తన రోజును పూర్తిగా ఉపయోగించుకున్నాడ"ని గిల్ అన్నాడు. ఈ వ్యాఖ్యలపై అజయ్ జడేజా తనదైన శైలిలో స్పందించాడు. "14 ఏళ్ల పిల్లవాడు తనపై తాను పూర్తి విశ్వాసం ఉంచాడు. ఎంతగా అంటే తాను నమ్మినదాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చాలనుకున్నాడు. చేసి చూపించాడు. ఎవరో ఆటగాడు చెప్పినట్లుగా ఇది అతడి అదృష్ట దినం" అని కౌంటర్ ఇచ్చాడు.
చిన్న వయసులోనే రికార్డు సెంచరీతో చెలరేగిన సూర్యవంశీపై అజయ్ జడేజా (Ajay Jadeja) ప్రశంసలు కురిపించాడు. "క్రికెట్ ఆడే మనమందరం.. డ్రాయింగ్ రూమ్‌లలో లేదా స్నేహితులతో ఆడుతున్నప్పుడో ఒక నిర్దిష్ట మార్గంలో మన ఆట గురించి కలలు కన్నాం. మనం ఇష్టపడేది సాధించాలని 14 మరియు 15 సంవత్సరాల వయస్సులో మనమంతా స్వప్నించాం. కానీ సూర్యవంశీ తన కలను నిజం చేసుకోవాలని జీవించాడు. అదే అతడి శక్తి. ఇక అతడి ఆటను వంద సార్లు విశ్లేషిస్తార"ని జడేజా పేర్కొన్నాడు.
వైభవ్ సూర్యవంశీ సక్సెస్‌లో రాజస్తాన్ రాయల్స్ హెచ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ (Vikram Rathour) కీలంగా వ్యహరించారని జడేజా వెల్లడించాడు. సూర్యవంశీని స్వేచ్ఛగా ఆడేలా ప్రోత్సహించారని ప్రశంసించాడు. కాగా, రాజస్తాన్ తన తర్వాతి మ్యాచ్ మే 1న జైపూర్‌లో ముంబై ఇండియన్స్‌తో ఆడుతుంది. మే 12న చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆర్‌ఆర్ తలపడనుంది.
చదవండి: తండ్రి త్యాగం, పట్టుదలతో ఎదిగిన వైభవ్ సూర్యవంశీ