'బంగారు' వేదాంత్.. డానిష్ ఓపెన్‌లో రెండో పతకం సాధించిన మాధవన్ కొడుకు

కొపెన్‌హగెన్ (డెన్మార్క్): డానిష్ ఓపెన్ అంతర్జాతీయ స్విమ్మింగ్ టోర్నమెంట్‌లో భారత స్విమ్మర్ వేదాంత్ మాధవన్ మరోసారి మెరిశాడు. నిన్న (ఏప్రిల్ 17) పురుషుల 1500 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలో రజతం సాధించిన వేదాంత్.. ఇవాళ (ఏప్రిల్ 18) 800 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలో బంగారు పతకం సాధించాడు. వేదాంత్ 800 మీటర్ల లక్ష్యాన్ని 8 నిమిషాల 17:28 సెకెన్లలో పూర్తి చేశాడు. వేదాంత్ రజతం పతకం నెగ్గి రోజు తిరగకుండానే పసిడి సాధించడం విశేషం. సినీ నటుడు మాధవన్ కుమారుడైన వేదాంత్ (16) ఇటీవలి కాలంలో జాతీయ, అంతర్జాతీయ వేదికలపై వరుస పతాకలు సాధిస్తూ సత్తా చాటుతున్నాడు.
గతేడాది జాతీయ జూనియర్ చాంపియన్‌షిప్‌లో నాలుగు రజతాలు, మూడు కాంస్య పతకాలు సాధించిన వేదాంత్.. లాత్వియా ఓపెన్‌లో కాంస్యం, తాజాగా డానిష్ ఓపెన్‌లో బంగారు, రజత పతకాలు సాధించాడు. వేదాంత్ అంతర్జాతీయ వేదికలపై వరుస పతకాలు సాధిస్తుండటంతో అతని తండ్రి మాధవన్ పుత్రోత్సాహంతో పొంగిపోతున్నాడు. మరోవైపు వేదాంత్ సాధించిన విజయాల పట్ల యావత్ భారత చలనచిత్ర సీమ ఆనందం వ్యక్తం చేస్తుంది. దక్షిణాదికి చెందిన మాధవన్.. తెలుగు, తమిళ చిత్రాలతో పాటు బాలీవుడ్‌లోనూ టాప్ హీరోల్లో ఒకడిగా కొనసాగుతున్నాడు. కాగా, డానిష్ ఓపెన్‌లో కొడుకు సాధించిన ఘనతకు సంబంధించిన వీడియోను మాధవన్ స్వయంగా ఇన్‌స్టాలో షేర్ చేశాడు.
చదవండి: ఢిల్లీ క్యాపిటల్స్ క్యాంప్‌లో కరోనా కల్లోలం.. విదేశీ ఆటగాడికి పాజిటివ్..?
మరిన్ని వార్తలు