
రహానే- పుజారా
సౌతాఫ్రికాతో తొలి టెస్టులో టీమిండియా చిత్తుగా ఓడిన తర్వాత ఇద్దరు సీనియర్ క్రికెటర్ల పేర్లు తరచూ వార్తల్లోకి వస్తున్నాయి. వారెవరో కాదు.. అజింక్య రహానే, ఛతేశ్వర్ పుజారా. టెస్టు స్పెషలిస్టులైన ఈ ఇద్దరు బ్యాటర్లు టీమిండియా సాధించిన పలు చిరస్మరణీయ విజయాల్లో కీలక పాత్ర పోషించారు.
ముఖ్యంగా విదేశీ గడ్డపై ఉత్తమంగా రాణించిన రికార్డు వీరికి ఉంది. టీమిండియా తరఫున ఇప్పటి వరకు 85 టెస్టులు ఆడిన ముంబై బ్యాటర్ రహానే 5077 పరుగులు సాధించాడు. అతడి సారథ్యంలోనే ఆసీస్ గడ్డపై టీమిండియా టెస్టు సిరీస్ గెలిచిన మ్యాచ్ జరిగింది.
ఇక ఈ ఏడాది జూలైలో వెస్టిండీస్ సిరీస్ సందర్భంగా రహానే చివరిసారిగా టీమిండియా తరఫున టెస్టు ఆడాడు. మరోవైపు.. తన కెరీర్‌లో ఇప్పటిదాకా భారత్ తరఫున 103 టెస్టులు ఆడిన పుజారా 7195 రన్స్ చేశాడు. ఆస్ట్రేలియాతో టెస్టు సందర్భంగా జూన్‌లో అతడు ఆఖరిసారి టీమిండియాకు ఆడాడు.
అయితే, దేశవాళి క్రికెట్‌తో పాటు ఇంగ్లండ్ కౌంటీల్లోనూ ఆడుతూ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. వీరిద్దరిని గనుక సౌతాఫ్రికాతో టెస్టులకు ఎంపిక చేసి ఉంటే ఫలితం వేరేలా ఉండేదని భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ సహా పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Ranji Trophy prep mode: 🔛 pic.twitter.com/kFN3PyvTHx
— Cheteshwar Pujara (@cheteshwar1) December 30, 2023
ఈ నేపథ్యంలో సౌరాష్ట్ర బ్యాటర్ పుజారా ఓ ఆసక్తికర వీడియోతో ముందుకు వచ్చాడు. రంజీ ట్రోఫీ ఆడేందుకు తాను సన్నద్ధం అవుతున్నట్లు తెలిపాడు. అయితే, ఇందులో అతడు రెడ్ బాల్‌తో కాకుండా వైట్ బాల్‌తో ప్రాక్టీస్ చేస్తున్నట్లు కనిపించడంతో నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.
మరోవైపు.. రహానే సైతం శుక్రవారం ఎక్స్ వేదికగా ఓ వీడియో పంచుకున్నాడు. ‘‘విశ్రాంతి లేని రోజులు’’ అంటూ రంజీలకు సిద్ధం అవుతున్నట్లు చెప్పకనే చెప్పాడు. కాగా టెస్టుల్లో అపార అనుభవం, మెరుగైన రికార్డులు ఉన్నా టీమిండియా సెలక్టర్లు తమను పక్కన పెట్టడాన్ని రహానే- పుజారా చాలెంజింగ్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది.
No rest days 🏏 pic.twitter.com/EM218MqMhK
— Ajinkya Rahane (@ajinkyarahane88) December 29, 2023
ఈ ఏడాది రంజీ ట్రోఫీలో సత్తా చాటి మళ్లీ భారత జట్టులో చోటే లక్ష్యంగా వీరిద్దరు ముందుకు సాగుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. జనవరి 5 నుంచి రంజీ ట్రోఫీ మ్యాచ్‌లు ఆరంభం కానున్నాయి.
చదవండి:Rohit Sharma: ఘనంగా రోహిత్ గారాలపట్టి సమైరా బర్త్‌డే.. వీడియో వైరల్