CT 2025: అఫ్గనిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు కీలక నిర్ణయం | Afghanistan Extend Jonathan Trott Contract As Head Coach Ahead CT 2025 | Sakshi
Sakshi News home page

CT 2025: అఫ్గనిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు కీలక నిర్ణయం

Dec 11 2024 10:41 AM | Updated on Dec 11 2024 11:10 AM

Afghanistan Extend Jonathan Trott Contract As Head Coach Ahead CT 2025

ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025 నేపథ్యంలో అఫ్గనిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మెగా టోర్నీలో తొలిసారి తమ జట్టు పాల్గొనబోతున్న నేపథ్యంలో హెడ్‌కోచ్‌గా జొనాథన్‌ ట్రాట్‌ పదవీ కాలాన్ని ఏడాది పొడిగించింది. ఈ క్రమంలో.. 2025 ఏడాది ముగింపుదాకా ట్రాట్‌ హెడ్‌ కోచ్‌గా కొనసాగుతాడు.

మేటి జట్లను కంగుతినిపించి
కాగా 43 ఏళ్ల ఈ ఇంగ్లండ్‌ మాజీ బ్యాటర్‌ 2022 జూలై నుంచి అఫ్గనిస్తాన్‌ హెడ్‌ కోచ్‌గా పనిచేస్తున్నాడు. అతడి శిక్షణలోని అఫ్గనిస్తాన్‌ జట్టు అంతర్జాతీయ క్రికెట్‌లో పలు చిరస్మరణీయ విజయాలు సాధించింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లాంటి మేటి జట్లను కంగుతినిపించింది.

ప్రపంచకప్‌లో తొలిసారి సెమీఫైనల్స్‌కు
అదే విధంగా.. అమెరికా- వెస్టిండీస్‌ సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చిన టీ20 ప్రపంచకప్‌-2024లో అఫ్గనిస్తాన్‌ తొలిసారి సెమీఫైనల్స్‌కు చేరింది. గతేడాది భారత్‌లో జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లోనూ గ్రూప్‌ దశలో మాజీ చాంపియన్లు ఇంగ్లండ్, పాకిస్తాన్, శ్రీలంక జట్లకు షాక్‌ ఇచ్చింది. తద్వారా కటాఫ్‌ సమయానికి ర్యాంకింగ్స్‌లో 8వ స్థానంలో నిలిచిన అఫ్గన్..‌ చాంపియన్స్‌ ట్రోఫీ(వన్డే ఫార్మాట్‌)కి అర్హత సంపాదించింది.

కేవలం వన్డేలకు మాత్రమే
అంతేకాదు.. ఇటీవల దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌లపై  ద్వైపాక్షిక సిరీస్‌లను 2–1తో కైవసం చేసుకుంది. ప్రధాన కోచ్‌గా ట్రాట్‌ నియామకం తర్వాత అఫ్గన్‌ జట్టు 14 వన్డేలు, 20 టీ20ల్లో గెలిచింది. ఇలాంటి సానుకూలతల నేపథ్యంలో అఫ్గాన్‌ బోర్డు ట్రాట్‌ కాంట్రాక్టును మరో ఏడాది పాటు పొడిగించడం విశేషం. 

అయితే ఈ దఫా అతడు కేవలం వన్డే ఫార్మాట్‌కు మాత్రమే జట్టుకు అందుబాటులో ఉంటాడు. వ్యక్తిగత కారణాల నేపథ్యంలో కుటుంబంతో గడిపేందుకు టీ20లు, టెస్టులకు జట్టుతో పయనించడు.

చదవండి: SA vs PAK: డేవిడ్ మిల్లర్ ఊచకోత.. ఉత్కంఠ పోరులో ఓడిన పాకిస్తాన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement