
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు స్వదేశంలో టీమిండియాతో మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్‌లో తలపడనుంది. మొదట వన్డే సిరీస్ జరగనుంది. అక్టోబర్ 19న పెర్త్ వేదికగా జరగనున్న తొలి వన్డేలో భారత్-ఆసీస్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి.
ఈ మ్యాచ్‌కు ముందు ఆసీస్‌కు భారీ షాక్ తగిలింది. మొదట వన్డేకు ప్లేయర్లు ఆడమ్ జంపా, జోష్ ఇంగ్లిస్ దూరమయ్యారు. రిపోర్ట్స్ ప్రకారం.. తన భార్య రెండవ బిడ్డకు జన్మనివ్వనుండడంతో స్పిన్నర్ జంపా న్యూ సౌత్ వేల్స్‌లోనే ఉండాలని నిర్ణయించుకున్నాడంట. దీంతో అడిలైడ్, సిడ్నీలలో జరిగే రెండు, మూడో వన్డేల కోసం తిరిగి జట్టులోకి చేరనున్నాడు. మరోవైపు ఇంగ్లిష్ కాలి కండరాల గాయం నుంచి కోలుకోలేదు.
ఈ క్రమంలోనే అతడు పెర్త్ వన్డేకు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఇక వీరిద్దరి స్ధానాలను మాథ్యూ కుహ్నెమాన్, జోష్ ఫిలిప్‌లతో ఆసీస్ సెలక్టర్లు భర్తీ చేశారు. వికెట్ కీపర్ బ్యాటర్ అయిన ఫిలిప్ ఆసీస్ తరపున వన్డే అరంగేట్రం చేయడం దాదాపు ఖాయమనే చెప్పాలి.
ఆస్ట్రేలియా ఫస్ట్-ఛాయిస్ కీపర్ అలెక్స్ కారీ భారత్‌తో వన్డేలకు ఎంపికైనప్పటికి.. యాషెస్‌కు సిద్ధం కావడానికి షెఫీల్డ్ షీల్డ్ గేమ్‌లో పాల్గోనేందుకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. దీంతో అతడు వన్డే సిరీస్ నుంచి వైదొలిగనట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే ఫిలిప్ వికెట్ కీపర్‌గా తుది జట్టులో చోటు దక్కించుకోనున్నాడు.
భారత్‌తో తొలి వన్డేకు ఆసీస్ జట్టు..
మిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్‌లెట్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), కూపర్ కొన్నోలీ, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, మాథ్యూ కుహ్నెమాన్, మిచెల్ ఓవెన్, జోష్ ఫిలిప్ (వికెట్ కీపర్), మాట్ రెన్షా, మాథ్యూ షార్ట్, మిచెల్ స్టార్క్
చదవండి: ఆంధ్ర రంజీ జట్టు కెప్టెన్‌గా రికీ భుయ్