SRH: ‘హృదయం ముక్కలైంది.. బాధ పడొద్దు మామయ్యా’! ఫొటో వైరల్‌ | Abhishek Sharma Little Niece Consoles Him With Hug After SRH Heartbreaking Loss, Video Goes Viral | Sakshi
Sakshi News home page

SRH: ‘హృదయం ముక్కలైంది.. బాధ పడొద్దు మామయ్యా’! ఫొటోలు వైరల్‌

Published Mon, May 27 2024 4:16 PM

Abhishek Sharma Little Niece Consoles Him With Hug After SRH Heartbreaking Loss


ఐపీఎల్‌-2024 సీజన్‌ ఆసాంతం విధ్వంసకర బ్యాటింగ్‌తో దుమ్ములేపిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌.. అసలు సమయం వచ్చేసరికి చేతులెత్తేసింది. ఏదైతే తమ బలం అనుకుందో అదే బలహీనతగా మారిన వేళ ప్రత్యర్థి ముందు తలవంచింది.

ముఖ్యంగా బ్యాటింగ్‌ లైనప్‌లో పెట్టనికోటగా ఉన్న ఓపెనర్లు అభిషేక్‌ శర్మ, ట్రావిస్‌ హెడ్‌ అనూహ్య రీతిలో పూర్తిగా విఫలం కావడంతో 113 పరుగులకే కుప్పకూలింది. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ బౌలర్ల దెబ్బకు అభిషేక్‌ శర్మ ఐదు బంతులు ఎదుర్కొని కేవలం 2 పరుగులకే నిష్క్రమించగా.. పరుగుల విధ్వంసానికి మారుపేరుగా నిలిచిన హెడ్‌ మరీ ఘోరంగా డకౌట్‌ అయ్యాడు.

వీరితో పాటు వన్‌డౌన్‌ బ్యాటర్‌ రాహుల్‌ త్రిపాఠి(13 బంతుల్లో 9) కూడా త్వరగానే పెవిలియన్‌ చేరగా.. మిగతా వాళ్లలో ఐడెన్‌ మార్క్రమ్‌(20), హెన్రిచ్‌ క్లాసెన్‌(17 బంతుల్లో 16), కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌(19 బంతుల్లో 24) మాత్రమే డబుల్‌ డిజిట్‌ స్కోర్లు చేశారు.

ఈ క్రమంలో ఐపీఎల్‌ ఫైనల్లోనే అత్యల్ప స్కోరు నమోదు చేసిన జట్టుగా చెత్త రికార్డు తన పేరిట లిఖించుకుంది సన్‌రైజర్స్‌. ఈ సీజన్‌లో ఏకంగా 287 పరుగులతో లీగ్‌ చరిత్రలోనే అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా ప్రశంసలు అందుకున్న కమిన్స్ బృందం.. ఫైనల్లో ఇలా తేలిపోయింది. దీంతో ఆరెంజ్‌ ఆర్మీ హృదయం ముక్కలైంది.

ఇక ఆద్యంతం అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న కేకేఆర్‌ సన్‌రైజర్స్‌ను ఏకంగా ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తు చేసి చాంపియన్‌గా నిలిచింది. ఏకపక్ష విజయంతో ముచ్చటగా మూడోసారి ట్రోఫీని ముద్దాడింది.

ఈ నేపథ్యంలో కేకేఆర్‌ శిబిరంలో సంతోషాలు వెల్లివిరియగా.. సన్‌రైజర్స్‌ క్యాంపు నిరాశలో కూరుకుపోయింది. జట్టు యజమాని కావ్యా మారన్‌ ఓటమిని జీర్ణించుకోలేక కన్నీళ్లు పెట్టుకోగా.. ఆటగాళ్లు కూడా ఇంచుమించు ఇదే స్థితికి చేరుకున్నారు.

ఇక ఈ సీజన్‌లోనే అత్యధిక సిక్సర్లు(42) బాదిన సన్‌రైజర్స్‌ ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ కూడా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. ఆ సమయంలో అభిషేక్‌ చిన్నారి మేనకోడలు అమైరా చేసిన పని నెటిజన్ల మనసు దోచుకుంది.

‘‘ఏం కాదులే మామయ్య’’ అన్నట్లుగా అభిషేక్‌ను హత్తుకున్న అమైరా అతడిని ఓదార్చింది. తర్వాత ఇద్దరూ కలిసి కాసేపు ముచ్చటించుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను అభిషేక్‌ రెండో అక్క కోమల్‌ శర్మ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.

కాగా పంజాబ్‌కు చెందిన అభిషేక్‌ శర్మ తండ్రి రాజ్‌కుమార్‌ శర్మ కూడా క్రికెటర్‌. దేశవాళీ క్రికెట్‌ ఆడిన ఆయన తన కుమారుడికి మొదటి కోచ్‌. ఇక అభిషేక్‌ తల్లి పేరు మంజు శర్మ. అభిషేక్‌కు ఇద్దరు అక్కలు సానియా, కోమల్‌ ఉన్నారు. పెద్దక్క సానియా శర్మ కూతురే ఈ అమైరా!

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement