నాగ్‌పూర్ వేదికగా న్యూజిలాండ్‌తో ఇవాళ (జనవరి 21) జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ మహోగ్రరూపం దాల్చాడు. కేవలం 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి, న్యూజిలాండ్‌పై అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ పూర్తి చేసిన భారత ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. గతంలో ఈ రికార్డు కేఎల్ రాహుల్ పేరిట ఉండేది. రాహుల్ 2020లో ఆక్లాండ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 23 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.
అభిషేక్‌కు టీ20ల్లో ఇది ఏడో హాఫ్ సెంచరీ. దీంతో అతను మరిన్ని రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20ల్లో అత్యధిక సార్లు 25 అంతకంటే తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీలు (8) పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. అభిషేక్ తర్వాతి స్థానాల్లో ఫిల్ సాల్ట్, సూర్యకుమార్ యాదవ్, ఎవిన్ లూయిస్ ఉన్నారు. వీరంతా తలో ఏడు సార్లు 25 అంతకంటే తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీలు పూర్తి చేశారు.
ఈ ఇన్నింగ్స్‌లో మొత్తంగా 35 బంతులు ఎదుర్కొన్న అభిషేక్.. 5 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 84 పరుగులు చేసి ఐష్ సోధి బౌలింగ్‌లో మరో భారీ షాట్‌కు ప్రయత్నించి జేమీసన్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఇదే ఇన్నింగ్స్‌లో అభిషేక్ టీ20ల్లో 5000 పరుగుల మార్కును తాకాడు. అభిషేక్ తన స్వల్ప అంతర్జాతీయ టీ20 కెరీర్‌లో (33 ఇన్నింగ్స్‌లు) 2 సెంచరీలు, 7 హాఫ్ సెంచరీల సాయంతో, 190.92 స్ట్రయిక్‌రేట్‌తో, 37.46 సగటున 1199 పరుగులు చేశాడు. ఇందులో 112 ఫోర్లు, 81 సిక్సర్లు ఉన్నాయి.
మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి న్యూజిలాండ్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా తొలి బంతి నుంచే ఎదురుదాడి ప్రారంభించింది. ముఖ్యంగా అభిషేక్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. మరో ఓపెనర్ సంజూ శాంసన్ (7 బంతుల్లో 10; 2 ఫోర్లు) స్వల్ప స్కోర్‌కే ఔటైనా అభిషేక్ తన విధ్వంసాన్ని కొనసాగించాడు. రెండేళ్ల తర్వాత జట్టులోకి వచ్చిన ఇషాన్ కిషన్ (8) సైతం నిరాశపర్చినా, అభిషేక్ మెరుపులు ఆగలేదు. ఇంకా చెప్పాలంటే ఇషాన్ ఔటయ్యాక శృతి మించాయి.
కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (22 బంతుల్లో 32; 4 ఫోర్లు, సిక్స్) క్రీజ్‌లో నిలదొక్కుకునే ప్రయత్నంలో మరోసారి విఫలమయ్యాడు. ఆతర్వాత వచ్చిన శివమ్ దూబే (9) భారీ షాట్లు ఆడే క్రమంలో ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజ్‌లో ఉన్న హార్దిక్ (14 బంతుల్లో 25 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) మెరుపులు మెరిపిస్తున్నాడు. అతనికి జతగా రింకూ సింగ్ (4) క్రీజ్‌లో ఉన్నాడు. 15.3 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 185/5గా ఉంది.


