
వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్‌లో (WCL) సౌతాఫ్రికా బ్యాటింగ్ దిగ్గజం ఏబీ డివిలియర్స్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. ఈ టోర్నీలో తొలి మ్యాచ్ నుంచే భీకర ఫామ్‌లో ఉన్న ఏబీడీ.. ఇవాళ (జులై 27) ఆస్ట్రేలియా లెజెండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మహోగ్రరూపం దాల్చాడు.
కేవలం 39 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి విధ్వంసం సృష్టించాడు. ఈ ఇన్నింగ్స్‌లో మొత్తంగా 46 బంతులు ఎదుర్కొన్న ఏబీడీ 15 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 123 పరుగులు చేసి ఔటయ్యాడు.
AB DE VILLIERS MADNESS IN WCL - HUNDRED vs AUS & ENG..!!!
- The GOAT 🐐 pic.twitter.com/qHDkZbUKod— Johns. (@CricCrazyJohns) July 27, 2025
ఏబీడీతో పాటు మరో ఓపెనర్ జేజే స్మట్స్ కూడా సునామీ ఇన్నింగ్స్‌తో (53 బంతుల్లో 85; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) విరుచుకుపడటంతో ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ చేసిన సౌతాఫ్రికా అతి భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 6 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది.
ఏబీడీ-స్మట్స్ తొలి వికెట్‌కు 187 పరుగులు జోడించాక, సౌతాఫ్రికా స్వల్ప వ్యవధుల్లో వికెట్లు కోల్పోయింది. వీరి తర్వాత వచ్చిన బ్యాటర్లు జేపీ డుమిని (16), మోర్నీ వాన్ విక్ (3), హెన్రీ డేవిడ్స (1), వేన్ పార్నెల్ (1) పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఆసీస్ బౌలర్లలో పీటర్ సిడిల్ 3 వికెట్లు పడగొట్టగా.. బ్రెట్ లీ, స్టీవ్ ఓకీఫ్, డేనియల్ క్రిస్టియన్ తలో వికెట్ దక్కించుకున్నారు.
మూడు రోజుల వ్యవధిలో రెండో శతకం
WCL 2025లో ఏబీడీ తొలి మ్యాచ్ నుంచే అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉన్నాడు. భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో 30 బంతుల్లో అజేయమైన 63 పరుగులు చేసిన అతను.. మూడు రోజుల కిందట ఇంగ్లండ్‌పై 41 బంతుల్లోనే శతక్కొట్టాడు. ఆ మ్యాచ్‌లో మొత్తంగా 51 బంతులు ఎదుర్కొన్న ఏబీడీ అజేయమైన 116 పరుగులు చేశాడు.
ఈ టోర్నీలో ఏబీడీ సూపర్ ఫామ్‌లో ఉండటంతో సౌతాఫ్రికా ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో 3 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో పాకిస్తాన్ తర్వాత రెండో స్థానంలో ఉంది. ఈ టోర్నీలో భారత్ ఆడిన 3 మ్యాచ్‌ల్లో రెండు ఓడి చివరి స్థానంలో ఉంది. ఈ టోర్నీలో పాకిస్తాన్‌తో జరగాల్సిన మ్యాచ్‌ను భారత్ రద్దు చేసుకున్న విషయం తెలిసిందే.