
ఒమన్ క్రికెటర్ కలీమ్ జోరు
భారత్‌పై రాణించి వార్తల్లోకి
అబుదాబీ వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఒమన్ బ్యాటర్ ఆమిర్ కలీమ్ భారత్‌పై అర్ధ సెంచరీ చేశాడు. ఈ ఫిఫ్టీ పూర్తవడంతోనే అదేదో సెంచరీ లేదంటే డబుల్ సెంచరీ చేసినంతగా సంబరాలు చేసుకున్నాడు. డగౌట్‌లో ఉన్న సహచరులు కూడా అతనికి చప్పట్లతో జేజేలు పలికారు. ఇది మనకు ‘ఓవరాక్షన్’లా కనిపించింది. చేసిన అర్ధ శతకానికే ఏంటీ సంబరాలు అనిపించింది. కానీ అసలు సంగతి మరొకటి ఉంది.
ఎందుకంటే అతనేమీ టి20లు ఆడే రెగ్యులర్ యువ క్రికెటర్ కాదు. 44 ఏళ్ల వెటరన్! అంతేకాదు. ఓ రిటైర్డ్ క్రికెటర్ కూడా! ఆట వదిలేసి కోచింగ్ బాట పట్టిన కలీమ్ తిరిగొచ్చి యువకుడిలా చెలరేగడమే గొప్ప విశేషం. ఈ విశేషం తాలుకూ సంబరాలే ఆ చిందులు!
కోచింగ్‌లో టైటిల్
కొన్ని నెలల క్రితం థాయ్‌లాండ్‌లో జరిగిన అండర్–19 ప్రపంచకప్ డివిజన్–2 ఆసియా క్వాలిఫయర్స్‌లో ఒమన్ యువజట్టు టైటిల్ గెలిచింది. ఈ జట్టును తీర్చిదిద్దింది మరెవరో కాదు... ఆమిర్ కలీమ్. అలా కోచ్‌గా సక్సెస్ అయ్యాడు. కానీ అతని జాతీయ క్రికెట్‌లో సంక్షోభం తలెత్తింది. ఏకంగా 11 మంది ఒమన్ ఆటగాళ్లు మస్కట్‌లో ఎమర్జింగ్ ఆసియా కప్‌కు ముందు వైదొలిగారు.
అమెరికా, కరీబియన్‌లలో జరిగిన టి20 ప్రపంచకప్‌లో పాల్గొన్న తమకు బోర్డు ప్రైజ్‌మనీ ఇవ్వకపోవడంతో కెప్టెన్ అఖిబ్ ఇలియాస్, మాజీ కెప్టెన్ జీషాన్ మక్సూద్ సహా 11 మంది ఒమన్‌కు ఆడేందుకు ససేమిరా అన్నారు. దీంతో ఒమన్ క్రికెట్ బోర్డు తమ మాజీ క్రికెటర్, ప్రస్తుత అండర్–19 జట్టుకు కోచ్ అయిన ఆమిర్ కలీమ్‌ను ఆడేందుకు పిలిచింది. దీంతో అతను రిటైర్మెంట్‌ను పక్కనబెట్టి ఆడేందుకు సై అన్నాడు.
భారత్‌పై మెరుపు ఫిఫ్టీ
అలా ఒమన్ క్రికెట్ జట్టును సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు వచి్చన కలీమ్ వయసు సహకరించకపోయినా... క్రికెట్‌పై అంకితభావంతో ఆటగాడిగా మళ్లీ మైదానంలో చెమటోడ్చాడు. అబుదాబీలోని జాయెద్ క్రికెట్ స్టేడియంలో పటిష్టమైన భారత బౌలింగ్‌ను ఎదుర్కొన్న తీరు ఆకట్టుకుంది. ఈ వెటరన్ క్రికెటర్ తమ కెప్టెన్ జతిందర్ సింగ్‌తో ఇన్నింగ్స్‌ను ఓపెన్ చేశాడు.
భారత బౌలర్లపై దూకుడుగా ఆడి బౌండరీలు బాదాడు. ఈ క్రమంలో 38 బంతుల్లో అర్ధసెంచరీ చేశాడు. ఇటీవల కోచ్‌గా మార్గదర్శనం చేసిన చేతులతోనే తాజాగా సెంచరీ చేసిన ఆనందం కట్టలు తెగడంతో అంతగా సంబరాల్లో మునిగితేలాడు. ఓపెనర్‌గా వచ్చిన కలీమ్ 18వ ఓవర్‌గా నిలబడటం గొప్ప విశేషం. అంతేకాదు భారత శిబిరాన్ని కూడా తన మెరుపు బ్యాటింగ్‌తో కాసేపు వణికించాడు.
ఉద్యోగం కోసం కరాచీ నుంచి...
పాకిస్తాన్‌కు చెందిన కలీమ్‌కు క్రికెట్ అంటే ఇష్టం. కానీ ఉపాధి కోసం పొట్టచేతపట్టుకొని కరాచీ నుంచి 2004లో ఒమన్ బాటపట్టాడు. అక్కడ డెలివరీ సెక్షన్‌లో లోడింగ్, అన్‌లోడింగ్ చేసే హమాలీగా పనిచేశాడు. వేడి వాతావరణ పరిస్థితుల మధ్య చెమట చిందించిన కలీమ్ తర్వాత రెస్టారెంట్‌లో పనికి కుదిరాడు. భారత సంతతికి చెందిన రెస్టారెంట్ యజమాని కెకె మోహన్‌దాస్‌కు క్రికెట్ అంటే పిచ్చి అభిమానం. స్థానికంగా ఓ క్రికెట్ క్లబ్‌ను ఆయన నడిపిస్తున్నాడు.
ఇది తెలుసుకున్న కలీమ్ తన క్రికెట్ జిజ్ఞాసను యజమానికి వివరించాడు. ఓ అవకాశం ఇవ్వాలని అభ్యర్థించాడు. అతని ఉత్సాహాన్ని గమనించిన మోహన్‌దాస్ కొత్త కిట్ కొనిచ్చి ప్రోత్సహించాడు. అలా భారత సంతతి యజమాని ప్రోత్బలంతో ఆమిర్ కలీమ్ 2012లో ఒమన్ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. ప్రస్తుత కెప్టెన్ జతిందర్ సింగ్‌తో కలిసి 13 ఏళ్ల పాటు ఒమన్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఇద్దరు కూడా ఓ పూట జాబ్ చేసుకుంటూనే క్రికెట్‌ను కొనసాగించారు. ఇన్నేళ్లుగా రాని గుర్తింపు ఈ ఒక్క మ్యాచ్ (భారత్)తో కలీమ్‌కు వచ్చింది.
– సాక్షి క్రీడా విభాగం