Aakash Chopra: వరల్డ్‌ ఎలెవన్‌ జట్టు.. కోహ్లికి స్థానం లేదు!

Aakash Chopra World XI to Take on New Zealand No Place For Virat Kohli - Sakshi

న్యూఢిల్లీ: టీమిండియాను ఓడించి వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ తొలి టైటిల్‌ను కైవసం చేసుకున్న న్యూజిలాండ్‌పై ప్రశంసల వర్షం కురుస్తూనే ఉంది. అత్యుత్తమ జట్లలో ఒకటిగా పేరుగాంచిన భారత్‌ను 8 వికెట్ల తేడాతో ఓడించిన కివీస్‌ ఆటగాళ్లను మాజీ క్రికెటర్లు కొనియాడుతూనే ఉన్నారు. ముఖ్యంగా గత వన్డే వరల్డ్‌ కప్‌ ఫైనల్‌కు చేరడం, ప్రస్తుతం మేజర్‌ ట్రోఫీని సొంతం చేసుకున్న తీరును ప్రశంసిస్తున్నారు. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్‌, ప్రముఖ వ్యాఖ్యాత ఆకాశ్‌ చోప్రా.. బలమైన కివీస్‌ జట్టును ఓడించగల వరల్డ్‌ ఎలెవన్‌ జట్టు ఇదేనంటూ తన టీంను ప్రకటించాడు.

ఇంగ్లండ్‌ జట్టు కెప్టెన్‌ జో రూట్‌ను తన సారథిగా ఎన్నుకున్న ఆకాశ్‌ చోప్రా ఆశ్చర్యంగా టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లికి తన జట్టులో స్థానం కల్పించలేదు. భారత ఆటగాళ్లలో కేవలం హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ, రిషభ్‌ పంత్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌కు మాత్రమే చోటు ఇచ్చాడు. ఈ మేరకు తన యూట్యూబ్‌ చానెల్‌ వేదికగా అభిప్రాయం వెల్లడించిన ఆకాశ్‌ చోప్రా... ‘‘వరల్డ్‌ ఎలెవన్‌ జట్టులో రోహిత్‌ శర్మ, శ్రీలంక ఆటగాడు కరుణరత్నే ఓపెనర్లుగా ఉంటారు.

ఆసీస్‌ క్రికెటర్‌ మార్నస్‌ లబుషేన్‌కు మూడో స్థానం ఇస్తున్నా. జో రూట్‌.. నాలుగో ఆటగాడు. అవును.. కోహ్లి, బాబర్‌ ఆజం ఇందులో లేరు. ఇక స్టీవ్‌ స్మిత్‌ రూట్‌ తర్వాతి స్థానంలో వస్తాడు. ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ ఆరవ స్థానంలో ఉంటాడు. తను బంతితోనూ, బ్యాట్‌తోనూ ఆకట్టుకోగలడు. వికెట్‌ కీపర్‌గా రిషభ్‌ పంత్‌, స్పిన్నర్‌ కోటాలో అశ్విన్‌కు చోటు ఉంటుంది. పాట్‌ కమిన్స్‌, జోష్‌ హాజిల్‌వుడ్‌ కూడా ఉంటారు’’ అని చెప్పుకొచ్చాడు. కాగా ఆకాశ్‌ చోప్రా వ్యాఖ్యలపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. 

ఆకాశ్‌ చోప్రా వరల్డ్‌ ఎలెవన్‌ జట్టు:
రోహిత్‌ శర్మ, దిముత్‌ కరుణ రత్నే, మార్నస్‌ లబుషేన్‌, జో రూట్‌(కెప్టెన్‌), స్టీవ్‌ స్మిత్‌, బెన్‌ స్టోక్స్‌, రిషభ్‌ పంత్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, పాట్‌ కమిన్స్‌, స్టువర్ట్‌ బ్రాడ్‌, జోష్‌ హాజిల్‌వుడ్‌.

చదవండి: వోక్స్‌ విశ్వరూపం.. 185 పరుగులకే చాపచుట్టేసిన లంకేయులు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top