Aakash Chopra: 36 ఆలౌట్‌ గుర్తుందా.. సిరీస్‌ ఓటమి గుర్తు లేదా..?

Aakash Chopra Shuts Down Cricket Australia With Brilliant Response To 36 All Out Jibe - Sakshi

IND VS AUS: దాయాదుల సమరం, యాషెస్‌ సిరీస్‌ తర్వాత క్రికెట్‌లో అంత క్రేజ్‌ ఉన్న సిరీస్‌ ఏదైనా ఉందంటే..? అది భారత్‌, ఆస్ట్రేలియా మధ్య జరిగే బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీనేని తప్పక చెప్పాల్సిందే. ఇరు జట్ల మధ్య గత 27 ఏళ్లుగా జరుగుతున్న ఈ రైవల్రీలో ఇది చాలా సార్లు నిరూపితమైంది. ఈ విషయాన్ని పక్కకు పెడితే.. ఆసీస్‌ క్రికెటర్లు, ఆ దేశ క్రికెట్‌ బోర్డు ప్రతి సిరీస్‌ ప్రారంభానికి ముందు ప్రత్యర్థి జట్టుపై మాటల యుద్ధానికి దిగి, ఆ జట్టును నైతికంగా బలహీన పర్చాలని వ్యూహాలను రచిస్తుందన్న విషయం విధితమే. ఆసీస్‌ ఆడే ఈ మైండ్‌ గేమ్‌లో మేటి జట్లు సైతం చిక్కి విలవిలలాడిన సందర్భాలు మనం చాలా చూశాం.

BGT 2023 ప్రారంభానికి ముందు కూడా ఆసీస్‌ ఇలాంటి మైండ్‌ గేమ్‌నే మొదలుపెట్టింది. టీమిండియా ఆటగాళ్లను, జట్టు ప్రదర్శనను తక్కువ చేస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తుంది. తాజాగా ఆ దేశ క్రికెట్‌ బోర్డే (క్రికెట్‌ ఆస్ట్రేలియా) రంగంలోకి దిగి టీమిండియాను కించపర్చే విధంగా ట్వీట్‌ చేసింది. 2020-21 సిరీస్‌లో అడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా 36 పరుగులకే ఆలౌటైన విషయాన్ని ప్రస్తావించి రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. సీఏ ఆడిన ఈ మైండ్‌ గేమ్‌కు టీమిండియా ఆటగాళ్లు కానీ, యాజమాన్యం కానీ స్పందించనప్పటికీ.. భారత మాజీ ఓపెనర్‌, ప్రముఖ వ్యాఖ్యాత ఆకాశ్‌ చోప్రా తనదైన శైలిలో స్పందించాడు.

భారత్‌ 36 పరుగులకే ఆలౌటైన విషయం ఓకే.. సిరీస్‌ సంగతేంటీ..? అంటూ సుతిమెత్తగా కౌంటరిచ్చాడు. ఆ సిరీస్‌లో తొలి టెస్ట్‌లోనే టీమిండియా ఓటమిపాలు కావడంతో 4 టెస్ట్‌ల సిరీస్‌ను ఆసీస్‌ క్లీన్‌ స్వీప్‌ చేస్తుందని అంతా ఊహించారు. అయితే అనూహ్యంగా పుంజుకున్న టీమిండియా ఆసీస్‌కు వారి స్వదేశంలోనే ఫ్యూజుల ఎగిపోయేలా చేసి 2-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. ఈ విషయాన్నే ఆకాశ్‌ చోప్రా పరోక్షంగా ప్రస్తావించి.. ఆసీస్‌ మైండ్‌గేమ్‌కు కౌంటరిచ్చాడు. ఈ ట్వీట్‌ ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతోంది. కాగా, 2020-21 సిరీస్‌లో విరాట్‌ కోహ్లి తొలి టెస్ట్‌ అనంతరం తప్పుకున్నప్పటికీ.. యువకులతో కూడిన యంగ్‌ ఇండియా అద్భుతమైన పోరాటపటిమ కనబర్చి ఆసీస్‌కు షాకిచ్చింది. 

 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top