BGT 2023: టీమిండియాతో రెండో టెస్ట్‌.. స్పీడ్‌ గన్‌ వచ్చేస్తున్నాడా.. ఆసీస్‌ మైండ్‌గేమ్‌ ఆడుతుందా..?

BGT 2023: Mitchell Starc Will Join Australian Squad For Second Test - Sakshi

బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ 2023లో భాగంగా నాగ్‌పూర్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా ఇన్నింగ్స్‌ 132 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. కేవలం 3 రోజుల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్లు అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించి, 4 మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లారు. తొలి మ్యాచ్‌లోనే ఎదురైన ఘోర పరాభవం నేపథ్యంలో ఆసీస్‌ రెండు టెస్ట్‌లో భారీ మార్పులకు వెళ్లనుందని క్రికెట్‌ ఆస్ట్రేలియా తమ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా క్లూ వదిలింది.

తొలి టెస్ట్‌లో ఓటమిపాలైన గంటల వ్యవధిలోనే క్రికెట్‌ ఆస్ట్రేలియా తమ స్టార్‌ పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ రెండో టెస్ట్‌కు సంసిద్ధంగా ఉన్నాడంటూ ట్వీట్‌ చేసింది. ఇది నిజమో లేక ఆసీస్‌ టీమ్‌ మైండ్‌గేమ్‌లో భాగమో తెలీదు కానీ.. తమ స్పీడ్‌ గన్‌ వేలి గాయం నుంచి వేగంగా కోలుకుంటున్నాడని, అతను త్వరలోనే న్యూఢిల్లీలో ఆసీస్‌ క్యాంప్‌లో చేరతాడని క్రికెట్‌ ఆస్ట్రేలియా ట్విటర్‌ వేదికగా ప్రకటించింది.

రెండో టెస్ట్‌కు వేదిక అయిన అరుణ్‌ జైట్లీ స్టేడియం పిచ్‌ స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుందా లేక పేసర్లకు సహకరించే అవకాశం ఉందా అన్న కనీస సమాచారం లేకుండా క్రికెట్‌ ఆస్ట్రేలియా ఈ ప్రకటన చేయడం వెనుక మైండ్‌గేమ్‌ ఉంటుందని టీమిండియా ఫ్యాన్స్‌ భావిస్తున్నారు. గతంలోకి ఓసారి వెళ్తే.. అరుణ్‌ జైట్లీ స్టేడియం పిచ్‌ స్పిన్నర్‌ ఫ్రెండ్లీగా పిచ్‌గా చూశాం. ఇలాంటి పిచ్‌పై ఏ జట్టైనా అదనపు స్పిన్నర్‌కు తీసుకోవాలని భావిస్తుంది కానీ, హడావుడిగా గాయం నుంచి పూర్తిగా కోలుకోని పేసర్‌ను తుది జట్టులోకి తీసుకోవాలని అనుకోదు.

తొలి టెస్ట్‌ కోల్పోయిన బాధలో ఉన్న ఆసీస్‌.. టీమిండియాను మిస్‌ లీడ్‌ చేసే ప్రయత్నంలో స్టార్క్‌ సంసిద్ధతను పావుగా వాడుకుంటుందని ఫ్యాన్స్‌ అభిప్రాయపడుతున్నారు. ఇందుకు తొలి టెస్ట్‌ అనంతరం ఆసీస్‌ కెప్టెన్‌ కమిన్స్‌ చేసిన వ్యాఖ్యలు బలాన్ని చేకూరుస్తున్నాయి. మ్యాచ్‌ అనంతరం కమిన్స్‌ ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ.. రెండో టెస్ట్‌పై ఇప్పటినుంచే డిస్కషన్‌ చేయడంలో అర్ధం లేదని అన్నాడు. రెండో టెస్ట్‌ కోసం ఆసీస్‌ తుది జట్టులో ఎలాంటి మార్పులు ఉండబోతున్నాయన్న ప్రశ్న ఎదురైనప్పుడు కమిన్స్‌ ఈ రకంగా స్పందించాడు.

న్యూఢిల్లీ టెస్ట్‌కు ఆసీస్‌ మరో పేసర్‌ జోష్‌ హేజిల్‌వుడ్‌, పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ ​కెమరూన్‌ గ్రీన్‌ అందుబాటులో ఉంటారా..? తొలి మ్యాచ్‌లో విఫలమైన మ్యాట్‌ రెన్‌షా, హ్యాండ్స్‌కోంబ్‌, పేసర్‌ బోలాండ్‌లను తప్పిస్తారా అన్న ప్రశ్నలు ఎదురైనప్పుడు కమిన్స్‌ మాట్లాడుతూ.. తదుపరి మ్యాచ్‌లో పెద్దగా మార్పులు ఉంటాయని నేను అనుకోను అంటూ దాటవేసే ధోరణిలో సమాధానం చెప్పాడు. కమిన్స్‌ చేసిన ఈ వ్యాఖ్యల బట్టి చూస్తే.. ఆసీస్‌ టీమ్‌ టీమిండియాతో మైండ్‌గేమ్‌ మొదలుపెట్టిందన్న విషయం స్పష్టమవుతోంది. ఏదిఏమైనప్పటికీ ఆసీస్‌ తుది జట్టులో ఎవరెవరు ఉండబోతున్నారో తెలియాలంటే మ్యాచ్‌ ప్రారంభానికి అరగంట ముందు వరకు ఆగాల్సిందే. రెండో టెస్ట్‌ ఫిబ్రవరి 17 నుంచి ప్రారంభంకానుంది.   

 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top