యూ ఆర్‌ లైక్‌ ‘ఫైన్‌ వైన్‌’ తాంబే

48 Year Old Pravin Tambe Pulls Off A Catch For The Ages - Sakshi

ట్రినిడాడ్‌: కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(సీపీఎల్‌)లో భారత మాజీ క్రికెటర్‌ ప్రవీణ్‌ తాంబే అద్భుతమైన క్యాచ్‌ పట్టి ఔరా అనిపించాడు. మరొక నెలలో 49వ ఒడిలోకి అడుగుపెడుతున్న తాంబే.. సీపీఎల్‌లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌ తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అదే సమయంలో సీపీఎల్‌ ఆడుతున్న తొలి భారత క్రికెటర్‌గా కూడా తాంబే అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. 

సీపీఎల్‌లో భాగంగా ఆదివారం సెయింట్‌ కిట్స్‌ అండ్‌ నెవిస్‌ పాట్రియాట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నైట్‌రైడర్స్‌ గెలిచింది. ఫలితంగా ఈ లీగ్‌లో పదికి పది గెలిచి టాప్‌లో నిలిచింది. కాగా,  తాంబే కళ్లు చెదిరే క్యాచ్‌తో శభాష్‌ అనిపించాడు. సెయింట్‌ కిట్స్‌ ఇన్నింగ్స్‌లో భాగంగా  బెన్‌ డంక్‌ ఇచ్చిన క్యాచ్‌ను తాంబే పట్టుకున్న తీరు ప్రేక్షకుల్ని ముగ్థుల్ని చేసింది. ఫావద్‌ అహ్మద్‌ బౌలింగ్‌లో రివర్స్‌ స్వీప్‌ను బెన్‌ డంక్‌ ఆడబోగా అది కాస్తా టాప్‌ ఎడ్జ్‌ తీసుకుని గాల్లోకి లేచింది. ఆ సమయంలో షార్ట్‌ థర్డ్‌ మ్యాన్‌ ఏరియాకు పరుగెత్తుకొంటూ వచ్చిన తాంబే.. ఆ బంతిని కిందకు పడకుండా ఒడిసి పట్టుకున్నాడు. అదే సమయంలో బౌలింగ్‌లో కూడా తాంబే వికెట్‌ తీశాడు. వీటికి సంబంధించిన వీడియోను సీపీఎల్‌ యాజమాన్యం తన ట్వీటర్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేసింది.  దీనికి ప్రవీణ్‌ తాంబే ఏజ్‌ను గుర్తు చేస్తూ క్యాప్షన్‌ ఇచ్చింది. తాంబే యూ ఆర్‌ లైక్‌ ఫైన్‌ వైన్‌ అని క్యాప్షన్‌లో ఉంచింది. (చదవండి: వావ్‌.. పదికి పదికి గెలిచారు)

ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌  జట్టు లీగ్‌ దశను అజేయంగా ముగించింది. ఆడిన 10 మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది. సెయింట్‌ కిట్స్‌ తొలుత సెయింట్‌ కిట్స్‌ జట్టు 18.2 ఓవర్లలో 77 పరుగులకే కుప్పకూలింది. నైట్‌రైడర్స్‌ బౌలర్‌ ఫవాద్‌ అహ్మద్‌ 21 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. అనంతరం నైట్‌రైడర్స్‌ జట్టు 11.3 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 78 పరుగులు చేసి గెలుపొందింది. వెబ్‌స్టర్‌ (33 బంతుల్లో 41 నాటౌట్‌; 5 ఫోర్లు, సిక్స్‌) మెరిశాడు. మొత్తం ఆరు జట్లు రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ పద్థతిలో తలపడుతున్న ఈ టోర్నీలో టీకేఆర్‌ జట్టు లీగ్‌ దశలో 20 పాయింట్లతో టాప్‌ ర్యాంక్‌లో నిలిచింది. 

ఐపీఎల్‌లో బ్యాన్‌.. వివాదం ఇది
ఐపీఎల్‌ నుంచి తనను బ్యాన్‌ చేయడంపై వెటరన్‌ లెగ్‌ స్పిన్నర్‌ ప్రవీణ్‌ తాంబే మూడు నెలల క్రితం వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. తనను ఐపీఎల్‌ నుంచి బ్యాన్‌ చేసినప్పుడు ఇక మిగతా విదేశీ లీగ్‌లు ఆడకుండా అడ్డుకోవాలనుకోవడం మూర్ఖత్వమంటూ బీసీసీఐపై మండిపడ్డాడు.ఈ క్రమంలోనే సీపీఎల్‌ ఆడటానికి సిద్ధపడ్డాడు. 48 ఏళ్ల వయసులో ఐపీఎల్‌ బరిలోకి దిగాలని భావించిన అతనికి కొన్ని నెలల క్రితం బీసీసీఐ బ్రేక్‌ వేసింది. నిబంధనల ప్రకారం తాంబే ఐపీఎల్‌ ఆడేందును అనర్హుడని బోర్డు ఆదేశాలు జారీ చేసింది. గత ఏడాది యూఏఈలో జరిగిన టి10 లీగ్‌లో సింధీస్‌ జట్టు తరఫున తాంబే నాలుగు మ్యాచ్‌లు ఆడటం అతనిపై బ్యాన్‌కు కారణమైంది. బీసీసీఐ నిర్వహించే టోర్నీలో ఆడాలనుకునే వారు విదేశీ లీగ్‌ల్లో ఆడకూడదనే నిబంధన ఉన్నా దానిని తాంబే అతిక్రమించాడు. దాంతో నిషేధానికి గురయ్యాడు. (చదవండి: త్వరలో ఆటకు బెల్‌ బైబై)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top