వర్గల్(గజ్వేల్): ‘స్వాతి’ నక్షత్రం.. నృసింహుడి జన్మనక్షత్రం.. సరిగ్గా దీపావళి పర్వదినం ఆధ్యాత్మికత పంచుతున్న వేళ.. ప్రసిద్ధ నాచగిరి లక్ష్మీనృసింహక్షేత్రం ‘గిరి ప్రదక్షిణ’తో అలరారింది. వేకువజామున భక్తజన హర్షధ్వానాలు, నారసింహ స్మరణల మధ్య పీఠాధిపతి మాధవానంద సరస్వతి శ్రీవారి జన్మనక్షత్ర మహోన్నత కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆలయ ఈఓ రంగాచారి, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, మాజీ ధర్మకర్తలు, ప్రముఖులు, అర్చక, వేదపండితులు, సిబ్బంది, భక్తజన పరివారం ఈ మహాక్రతువులో భాగస్వాములయ్యారు. కొండను చుడుతూ హరిద్రానది మీదుగా కొనసాగిన గిరి ప్రదక్షిణ అనంతరం గర్భగుడిలో స్వామివారికి విశేషపూజలు జరిపారు. శ్రీవారిని దర్శించుకుని తరించారు.


