కొర్రీలతో రైతుల వర్రీ | - | Sakshi
Sakshi News home page

కొర్రీలతో రైతుల వర్రీ

Nov 6 2026 11:27 AM | Updated on Nov 6 2026 11:27 AM

రైతులు అంగీకారపత్రం రాసిస్తేనే మార్కెట్‌లోకి ధాన్యం

వ్యవసాయ మార్కెట్‌లోకి రైతుల ధాన్యాన్ని అనుమతించాలంటే అధికారులు కొత్త నిబంధనలు విధిస్తున్నారు. వర్షాలు కురిసి ధాన్యం తడిస్తే మార్కెట్‌ శాఖకు ఎలాంటి సంబంధం లేదని రైతులు అంగీకార పత్రాలు ఇవ్వాలని ఈ నిబంధనకు సరే అంటేనే మార్కెట్‌లో ధాన్యం ఆరబెట్టుకోవడానికి అనుమతిస్తామని అధికారులు తిరకాసులు పెడుతున్నారు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. –హుస్నాబాద్‌

హుస్నాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ యార్డులో గత నెల 26న మంత్రి పొన్నం ప్రభాకర్‌ చేతుల మీదుగా ధాన్యం కొనుగొలు కేంద్రాన్ని ప్రారంభించారు. కేంద్రం ప్రారంభించి పది రోజులు గడుస్తున్నా నేటికీ ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించనేలేదు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు సరిగా లేక ధాన్యం దిగుబడి తగ్గింది. వరి కోతలు ప్రారంభమైనప్పటికీ, ధాన్యాన్ని ఆరబెట్టుకునేందుకు వ్యవసాయ క్షేత్రాల వద్ద కల్లాలు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు రైతులు పండించిన ధాన్యాన్ని ఎక్కడ ఆరబెట్టుకోవాలో తెలియని పరిస్థితి. దీంతో స్థానిక వ్యవసాయ మార్కెట్‌ యార్డులో ధాన్యాన్ని ఆరబెట్టుకోవడానికి రైతులు వెళ్తే అధికారులు అనుమతించడం లేదు. మార్కెట్‌లో ధాన్యం ఆరబెట్టుకోవాలంటే అధికారులు షరతులు పెడుతున్నారు. వర్షం వచ్చి ధాన్యం తడిస్తే మార్కెట్‌ అధికారులకు ఎలాంటి సంబంధం ఉండదని లిఖిత పూర్వకంగా రాసిస్తేనే అనుమతిస్తామని అధికారులు రైతులకు తెగేసి చెబుతున్నారు. ప్రస్తుతం 50 మంది రైతులు అంగీకార పత్రాలు రాసిచ్చారు. దాదాపు 5,500 క్వింటాళ్ల వరకు మార్కెట్‌ యార్డులో ధాన్యం ఆరబోశారు. సకాలంలో ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడం వల్లే ఇలాంటి నిబంధనలు రైతుల నెత్తిపై పెడుతున్నారు. గతంలో వ్యవసాయ మార్కెట్‌ యార్డులో భారీవర్షాలు కురిసి వేలాది క్వింటాళ్ల ధాన్యం తడిసిపోయి వరదల్లో కొట్టుకుపోయిన సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పచ్చి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగొలు చేయాలని రైతులతోపాటు వివిధ రాజకీయ పార్టీల ఆందోళనలతో హుస్నాబాద్‌ అట్టుడికింది. దీంతో ప్రభుత్వం దిగి వచ్చి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి, వరదలో కొట్టుకుపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించింది. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని అధికారులు అంగీకార పత్రాలను తెరపైకి తెచ్చారు.

సకాలంలో కొంటే ఈ తిప్పలుండవు: రైతులు

ఽమార్కెట్‌లో ధాన్యం కొనుగొలు కేంద్రం ప్రారంభించి పది రోజులు కావస్తున్నా సింగిల్‌ విండో ద్వారా ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించలేదని రైతులు వాపోతున్నారు. బయట దళారులకు అమ్మితే తక్కువ ధరకు కొంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాతావరణ మార్పుల వల్ల ఎప్పుడు వర్షాలు కురుస్తాయోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. ధాన్యాన్ని ఎండబెట్టాలంటే వ్యవసాయ క్షేత్రాల వద్ద ఽ స్థలం లేదని, మార్కెట్‌లో ఆరబెట్టుకోవడానికి వస్తే అధికారులు తిరకాసులు పెడుతున్నారని ఆవేదన చెందుతున్నారు. కొనుగోళ్లు ఆలస్యమవుతున్నాయని, ఇప్పటికే కొంతమంది రైతులు పచ్చి వడ్లనే అమ్ముకుంటున్న పరిస్థితి. వ్యాపారులకు లాభం చేకూర్చేందుకే ధాన్యం కొనుగొలులో ప్రభుత్వం ఆలస్యం చేస్తుందని, రైతులను పట్టించుకునే వారే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వర్షం వచ్చి ధాన్యం తడిస్తే మాకు సంబంధం లేదు

అధికారుల కొత్త నిబంధనలు

సకాలంలో కొంటే సమస్యే లేదంటున్న రైతులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement