తెలంగాణ వ్యవసాయ
కార్మిక సంఘం డిమాండ్
కొమురవెల్లి(సిద్దిపేట): ఉపాధిహామీ పథకాన్ని మున్సిపాలిటీ, పట్టణాల్లోనూ అమలు చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. గురువారం మండలంలోని రాంసాగర్ గ్రామంలోని ఉపాధి హామిపని ప్రదేశంలో కార్మికులతో సంఘం జిల్లా అధ్యక్షుడు తాడూరి రవీందర్ మాట్లాడుతూ ఉపాధి హామీ కార్మికుల డిమాండ్ల కోసం హైదరాబాద్‌లోని సీఆర్‌డీ కార్యాలయం శుక్రవారం తలపెట్టిన ధర్నాను విజయవంతం చేయాలన్నారు. కార్మికులకు 200 పని దినాలు కల్పించి, రోజువారి కూలీ రూ.800 చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉపాధిహామీ కూలీలను ఇబ్బందులకు గురి చేస్తున్న రెండు పూటల ఫొటోలు తీసే విధానాన్ని రద్దు చేయాలని కోరారు. కార్యక్రమంలో చింతల ఇంద్రుడు, బాల్‌రెడ్డి, గోపాల్, నర్సయ్య, సత్తమ్మ తదితరులు పాల్గొన్నారు.
మార్కెట్ కమిటీ చైర్మన్ గొల్లపల్లి కనకయ్య
దుబ్బాకటౌన్: రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతుధర పొందాలని ఏఎంసీ చైర్మన్ గొల్లపల్లి కనకయ్య పేర్కొన్నారు. రాయపోల్ మండల కేంద్రంలో గురువారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి పంటను కొనుగోలు చేస్తోందన్నారు. దళారులను నమ్మి తక్కువ ధరకు ధాన్యం విక్రయించి మోసపోవద్దని, వానాకాలంలో పండించిన ధాన్యాన్ని చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని భరోసానిచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్ మాసంపల్లి రాజు, ఏపీఎం యాదగిరి, ఏఓ నరేశ్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ పాల్గొన్నారు.
సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్
గజ్వేల్: కరువు బారిన పడ్డ రైతులను ఆదుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్ డిమాండ్ చేశారు. సీపీఐ ఆధ్వర్యంలో చేపట్టిన కరువుయాత్రలో భాగంగా గురువారం గజ్వేల్ మండలం అనంతరావుపల్లి గ్రామంలో ఎండిపోయిన పంటలను నాయకులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మంద పవన్ మాట్లాడుతూ...ఎల్‌నినో ప్రభావం, కరెంట్ కోతల కారణంగా రైతుల పంట నష్టానికి గురయ్యారన్నారు. అధికారులు గ్రామాల వారీగా పంట నష్టాన్ని అంచనా వేసి రైతులకు కరువు సాయం అందించాలని కోరారు. లేనిపక్షంలో పోరాటాలను ముమ్మరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గసభ్యుడు భట్టు దయానందరెడ్డి, కొమ్ముల భాస్కర్, వనేశ్, జనార్ధన్, శివలింగు కృష్ణ, నరేశ్ తదితరులు పాల్గొన్నారు.
● ఆత్మహత్య ఘటనతో భయాందోళన
● వర్గల్ బీసీ, ఎస్‌సీ హాస్టళ్లు ఖాళీ
వర్గల్(గజ్వేల్): బీసీ హాస్టల్‌లో విద్యార్థి రామ్‌చరణ్ ఆత్మహత్య ఘటనతో వర్గల్‌లోని హాస్టళ్ల విద్యార్థులు ఇంటిబాట పట్టారు. స్థానిక బీసీ బాలుర సంక్షేమ హాస్టల్, ఎస్‌సీ సంక్షేమ హాస్టల్‌లో ఉంటున్న విద్యార్థులు బుధవారం చోటుచేసుకున్న విషాదఘటనతో ఒకింత ఆందోళనకు గురయ్యారు. హాస్టల్‌లో ఘటన తెలిసి బుధవారం పలువురు తల్లిదండ్రులు తమ పిల్లలను ఇంటికి తీసుకెళ్లారు. మిగిలిన విద్యార్థుల తల్లిదండ్రులు గురువారం తీసుకెళ్లడంతో హాస్టళ్లు పూర్తిగా ఖాళీ అయ్యాయి. ఈ విషయాన్ని రెండు హాస్టళ్ల వార్డెన్లు ధ్రువీకరించారు.


