రీ సర్వేతో భూ సమస్యల పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

రీ సర్వేతో భూ సమస్యల పరిష్కారం

Nov 6 2026 11:27 AM | Updated on Nov 6 2026 11:27 AM

మిరుదొడ్డి(దుబ్బాక)/తొగుట(దుబ్బాక): భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించడానికే రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చిందని కలెక్టర్‌ హైమావతి తెలిపారు. గురువారం మిరుదొడ్డి మండలం లింగుపల్లి, తొగుట మండలం చందాపూర్‌ గ్రామాల్లో నిర్వహిస్తున్న భూ భారతి రీ సర్వే ప్రక్రియను ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. లింగుపల్లి గ్రామ విస్తీర్ణం 556 ఎకరాలకు గాను, 186 ఎకరాల్లో సర్వే చేసినట్లు తెలిపారు. అలాగే చందాపూర్‌ గ్రామ విస్తీర్ణం 780 ఎకరాలకు గానూ, 50 ఎకరాలు సర్వే పూర్తయినట్లు అధికారులు కలెక్టర్‌ దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టా భూములు సర్వే చేయడానికి రెండు రోజుల ముందుగానే రైతులకు, భూ యజమానులకు ముందస్తు సమాచారం అందించాలని ఆదేశించాలన్నారు. స్థానికంగా లేని భూ యజమానులకు సైతం సమాచారం అందించాలని జీపీఓ, సర్వేయర్‌లను ఆదేశించారు. సర్వే ప్రక్రియను రైతులు, భూ యజమానులు నిశితంగా గమనించి ఎలాంటి సందేహాలున్నా అధికారుల దృష్టికి తెచ్చి అనుమానాలను నివృతి చేసుకోవాలని సూచించారు. ఒక భూ యజమానికి ఒకే చోట పలు సర్వే నంబర్లలో భూమి ఉన్నట్లయితే వారికి భూ భారతి చట్టంలో ఆ యజమానికి ఒకే సర్వే నంబర్‌ కేటాయించడం జరుగుతుందని తెలిపారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న సాదాబైనామా దరఖాస్తులు పెండింగ్‌లో ఉంచకుండా డిస్పోజల్‌ చేయాలని ఆయా మండలాల తహసీల్దార్లను ఆదేశించారు. కార్యక్రమంలో ఆయా మండలాలకు చెందిన తహసీల్దార్లు, గ్రామ సర్పంచులు, ప్రజా ప్రతినిధులు, భూ యజమానులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ హైమావతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement