కాసులకు కొలువులు | - | Sakshi
Sakshi News home page

కాసులకు కొలువులు

Nov 6 2026 11:27 AM | Updated on Nov 6 2026 11:27 AM

తెలంగాణ మోడల్‌ స్కూళ్లలో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగాల భర్తీ

● యోగ, కంప్యూటర్‌, ఆర్ట్‌ టీచర్లు..లైబ్రేరియన్‌ పోస్టులు

● ఒక్కో పోస్టుకు రూ.లక్ష నుంచి రూ.2 లక్షలు డిమాండ్‌

● నియామకాల ప్రక్రియ ప్రైవేట్‌ ఏజెన్సీకి అప్పగింత

తెలంగాణ మోడల్‌ స్కూళ్లలో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగాలను అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. ఉద్యోగాల భర్తీ నిరుద్యోగులకు ఉపాధి కల్పించాల్సింది పోయి..కొందరికి కాసుల పంటగా మారుతోంది. యోగ, కంప్యూటర్‌, ఆర్ట్‌, లైబ్రేరియన్‌ పోస్టులను ఔట్‌సోర్సింగ్‌ విధానంలో భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నియామకాల బాధ్యతలను ఓ ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీకి అప్పగించినట్లు సమాచారం. అయితే ఉద్యోగం కావాలంటే ఒక్కో పోస్టుకు రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. –సాక్షి, సిద్దిపేట

జిల్లాలో 14 తెలంగాణ మోడల్‌ స్కూళ్లు ఉండగా అందులో ఒక్కో పాఠశాలకు యోగ, కంప్యూటర్‌, ఆర్ట్‌ టీచర్లతోపాటు ఒక లైబ్రేరియన్‌ ఇలా నాలుగు పోస్టుల చొప్పున 56 పోస్టులను ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో భర్తీ చేయాలని కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. టీచర్‌ పోస్టులకు నెలకు రూ.22,750, లైబ్రేరియన్‌ పోస్టుకు రూ.19,500 జీతం ఇవ్వనున్నారు. దీంతో ఉద్యోగం కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న నిరుద్యోగులు మోడల్‌ స్కూళ్లలోని ఈ పోస్టులపై ఆశలు పెట్టుకున్నారు. సంబంధిత విద్యార్హతలు, నైపుణ్యాలు కలిగిన అభ్యర్థులకు అవకాశం లభిస్తుందని భావిస్తున్నారు. అయితే నియామకాల పేరుతో బేరసారాలు జరుగుతున్నాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఒక్కో పోస్టుకు రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు ఇస్తే పోస్టు ఇప్పిస్తామని చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

జనగామలో పరీక్ష.. మరి సిద్దిపేట జిల్లాలో?

ఈ నియామకాల వ్యవహారంలో జిల్లాలవారీగా కనిపిస్తున్న వ్యత్యాసం మరో చర్చకు దారితీస్తోంది. జనగామ జిల్లాకు సంబంధించి మోడల్‌ స్కూళ్లలో ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో పోస్టులకు ఈనెల 2 నుంచి 6వ తేదీ వరకు దరఖాస్తులను ఆన్‌లైన్‌లో స్వీకరిస్తున్నారు. ఈ నెల 7న రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. సిద్దిపేటలో ఇప్పటివరకు ఎలాంటి నోటిఫికేషన్‌ విడుదల చేయలేదు. ఒకే రాష్ట్రంలో ఒకే రకమైన పోస్టుల భర్తీకి వేర్వేరు విధానాలు ఎందుకు అనుసరిస్తున్నారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జనగామలో పరీక్ష ద్వారా ఎంపిక చేస్తుంటే సిద్దిపేట జిల్లాల్లో ఏ ప్రాతిపదికన అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు? నిబంధనలపై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ రాకపోవడంతో నిరుద్యోగుల్లో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి నియామకాల కోసం జిల్లా యంత్రాంగం దరఖాస్తులు స్వీకరించి, సక్రమంగా నియామకాల ప్రక్రియ చేపట్టాలని నిరుద్యోగులు కోరుతున్నారు.

త్వరలో నోటిఫికేషన్‌

విడుదల చేస్తాం

తెలంగాణ మోడల్‌ స్కూళ్లలో కంప్యూటర్‌, ఆర్ట్‌, యోగా టీచర్ల నియామకాలకోసం త్వరలో నోటిఫికేషన్‌ విడుదల చేస్తాం. ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించి, మెరిట్‌ ఆధారంగా భర్తీ చేస్తాం. ఉద్యోగాల కోసం డబ్బులు ఇచ్చి మోసపోవద్దు. మెరిట్‌ ఆధారంగానే ఎంపికలు జరుగుతాయి.

–ప్రియాంక, జిల్లా ఎంప్లామెంట్‌ అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement