పొలాల్లో వాలిపోతున్న వ్యాపారులు సన్న వడ్లు క్వింటాలుకు రూ.3,200 వరకు కొనుగోలు లోటును పూడ్చుకునేందుకు కొందరు మిల్లర్ల మాయ జిల్లా వ్యాప్తంగా 1.22 లక్షల హెక్టార్లలో వరి సాగు
పచ్చి వడ్లకు మార్కెట్‌లో మంచి డిమాండ్ కొనసాగుతోంది. ఎల్‌నినో ప్రభావంతో వానా కాలంలో అరకొర పంటలే సాగయ్యాయి. దిగుబడి సైతం అంతంత మాత్రంగా వచ్చే అవకాశాలున్నాయి. దీంతో పంట కోతలు ప్రారంభం కాగానే వ్యాపారులు వాలిపోతున్నారు. క్వింటాల్‌కు రూ.2,600 నుంచి రూ. 3,200 వరకు కొనుగోలు చేస్తుండటం గమనార్హం. మద్దతు ధరకు మించి కొనుగోళ్లు చేస్తుండటంతో పలువురు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. – సాక్షి, సిద్దిపేట
జిల్లా వ్యాప్తంగా 1.22లక్షల హెక్టార్లలో వరి సాగైంది. అందులో దొడ్డు రకం 93,602హెక్టార్లు, సన్నాలు 28,398 హెక్టార్లు సాగు చేశారు. 5,67,801 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేశారు. అందులో ప్రైవేట్ వ్యాపారులు 2,17,601 మెట్రిక్ టన్నులు, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు 3.50లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని మార్కెటింగ్ శాఖ అంచనా వేసింది. జిల్లా వ్యాప్తంగా 424 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. ఇంకా ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలేదు. కొనుగోలు కేంద్రాల్లో దొడ్డు రకం ఏగ్రేడ్ ధాన్యం క్వింటాల్‌కు రూ.2,461, బీ గ్రేడ్ రూ.2,441, సన్న రకం వడ్లకు రూ. 2,461తో పాటు ప్రభుత్వం మరో రూ.500 బోనస్‌గా ఇస్తోంది.
సన్నాలు రూ.3,200కు కొనుగోలు
జిల్లాలో ముందుగా హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడలలో వరి కోతలు మొదలయ్యాయి. కల్లాల వద్దే వడ్లను కాంటాలు పెట్టి కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం సన్న బియ్యం ధరలు పెరగడం, భవిష్యత్‌లో కొరత ఏర్పడే ప్రమాదం ఉందని ముందే గుర్తించిన వ్యాపారులు సన్నధాన్యం ప్రధానంగా సాంబమసూరి, జైశ్రీరామ్, చింట్లు వంటి రకాల వడ్లు పచ్చిగా ఉన్నప్పుడే క్వింటాల్‌కు రూ.2,900 నుంచి రూ.3,200 వరకు కొంటున్నారు. దొడ్డు ధాన్యాన్ని క్వింటాల్‌కు రూ. 2,600 నుంచి రూ.2,800 కొనుగోలు చేస్తున్నారు. ఇప్పుడే ఇలా కొంటే ఎండితే 30 శాతం మేరకు బరువు తగ్గుతుంది. ఈ విషయం తెలిసినా.. ఎల్‌నినో వల్ల వచ్చే యాసంగిలో వరి సాగు మరింత తగ్గే అవకాశం ఉంది. దీంతో పచ్చి వడ్లు అయినా కొనుగోళ్లు చేసేందుకు ప్రైవేట్ వ్యాపారులు మొగ్గుచూపుతున్నారు. కొనుగోలు చేసి నిల్వ ఉంచుకుని రెట్టింపు ధరకు బియ్యం అమ్ముకోవచ్చని వ్యాపారులు ఉత్సాహం చూపుతున్నట్లు తెలుస్తోంది.
లోటును పూడ్చుకునేందుకే..
యాసంగిలో వరికి బదులు ఇతర పంటలను సాగు చేయాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తుండటంతో ధాన్యం లభించే అవకాశాలు తక్కువ కానున్నాయి. పచ్చి వడ్లతో అటుకులు, పేలాలు, మద్యం తయారీలో ఉపయోగిస్తారని, కొరత ఏర్పడే అవకాశం ఉండటంతో ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు పోటీ పడి పచ్చి ధాన్యాన్ని కొనుగోళ్లు చేస్తున్నారు. జిల్లాలోని కొంత మంది మిల్లర్లు లోటు పూడ్చుకునేందుకు కొనుగోళ్లు జరుపుతున్నారు.
కల్లాల వద్దే కాంటాలు


