మూడెకరాలు సాగుచేస్తే... అర ఎకరమే చేతికొచ్చింది | - | Sakshi
Sakshi News home page

మూడెకరాలు సాగుచేస్తే... అర ఎకరమే చేతికొచ్చింది

Oct 23 2026 7:24 AM | Updated on Oct 23 2026 7:24 AM

జనరేటర్‌కు రూ.21 వేలు వెచ్చించా మాజీ మంత్రి హరీశ్‌రావు ఎదుట వాపోయిన రైతు బూర్గుపల్లిలో ఎండిపోయిన వరిపొలాల పరిశీలన

గజ్వేల్‌: ‘మూడెకరాల్లో వరి సాగు చేశా.. కరెంట్‌ వస్తలేదని, మూడు రోజుల కోసం జనరేటర్‌ను రోజుకు రూ.4వేల చొప్పున కిరాయికి రూ.12వేలు, డీజిల్‌కు రూ. 9వేలు మొత్తంగా రూ.21వేలు ఖర్చుచేశా.. అయినా పొలం పారలే, ఖర్చు పెరిగిపోయింది. భారంగా మారి ఆపేసిన. మూడెకరాల్లో కేవలం అర ఎకరమే చేతికొచ్చింది..’ అంటూ గజ్వేల్‌ మండలం బూర్గుపల్లికి చెందిన రైతు అరవింద్‌రెడ్డి మాజీ మంత్రి హరీశ్‌రావు ఎదుట వాపోయారు. గురువారం ఎండిపోయిన వరి పొలాల పరిశీలనకు హరీశ్‌రావు.. సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్‌, ఎమ్మెల్సీ డాక్టర్‌ యాదవరెడ్డి, ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డిలతో కలిసి వచ్చారు. ఈ సందర్భంలో రైతులు ఒక్కొక్కరుగా తమ ఆవేదనను మాజీ మంత్రికి వివరించారు. సత్యనారాయణ అనే రైతు మాట్లాడుతూ ఆరు ఎకరాల్లో వరి సాగుచేస్తే.. లో–ఓల్టేజీ కారణంగా మోటారు, ట్రాన్స్‌ఫార్మర్‌ కాలిపోయి నీరందక మూడెకరాల్లో పంట ఎండిపోయిందన్నారు. రిమ్మనగూడ గ్రామానికి చెందిన దయ్యాల యాదయ్య అనే రైతు మాట్లాడుతూ మల్లన్నసాగర్‌–సంగారెడ్డి కాల్వను నమ్ముకొని పదెకరాల్లో వరిని సాగుచేస్తే కాల్వలోకి నీరు రాక పంట ఎండిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. వారి ఇబ్బందులను ప్రత్యక్షంగా పరిశీలించిన హరీశ్‌రావు మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యం వల్లే కరువు పరిస్థిలు నెలకొన్నాయని ఆరోపించారు. కన్నెపల్లి వద్ద మోటార్లను ఆన్‌ చేసి జిల్లాలోని రంగనాయకసాగర్‌, మల్లన్నసాగర్‌, కొండపోచమ్మసాగర్‌ రిజర్వాయర్లను నింపి ఉంటే ఈ పరిస్థితి ఉండేదా? అంటూ ప్రశ్నించారు. కార్యక్రమంలో గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గంగిశెట్టి చందన, నాయకులు బెండ మధు, కళ్యన్‌కర్‌ నర్సింగరావు, మాజీ జెడ్పీటీసీ మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement