● నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయండి ● మంత్రులు వివేక్, పొన్నంను కలిసిన నర్సారెడ్డి
గజ్వేల్: నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను పూర్తి చేయడానికి నిధులు ఇవ్వాలని, అదేవిధంగా ఖాళీగా ఉన్న నామినేటెడ్ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టాలని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి తూంకుంట నర్సారెడ్డి కోరారు. గురువారం నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేతలతో జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్, జిల్లాకు చెందిన మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో గజ్వేల్ రింగు రోడ్డు, ఇతర రోడ్ల విస్తరణ పనులు పెండింగ్‌లో ఉన్నాయని, ప్రభుత్వ కార్యాలయాలకు మరమ్మత్తులు, నూతన భవనాలు మంజూరు చేయాల్సి ఉందని మంత్రులకు వివరించారు. ప్రభుత్వ పథకాల్లో గజ్వేల్‌కు ప్రాధాన్యతనివ్వాలని కోరారు. అదేవిధంగా ఖాళీగా ఉన్న నామినేటెడ్ పదవులను భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు. తన విజ్ఞప్తి మంత్రులు సానుకూలంగా స్పందించినట్లు నర్సారెడ్డి తెలిపారు. కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి నాయిని యాదగిరి, వంటిమామిడి మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ విజయామెహన్, వైస్ చైర్మన్ ప్రభాకర్ గుప్త, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నరేందర్‌రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ సర్ధార్‌ఖాన్, లీగల్ సెల్ నాయకుడు సాజిద్‌బేగ్, గజ్వేల్ మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు ఆశోక్‌రెడ్డి, జిల్లా మైనార్టీ సెల్ మాజీ అధ్యక్షుడు సమీర్ తదితరులు పాల్గొన్నారు.


