ఖజానాకు చేరింది రూ.96.06 లక్షలే నల్లా పన్ను వసూళ్ల పై అధికారుల నిర్లక్ష్యం
(రూ.లక్షల్లో) (రూ.లక్షల్లో) (రూ.లక్షల్లో)
పన్ను వసూలు
సాక్షి, సిద్దిపేట: పట్టణాల్లో ప్రజలకు నీరు సరఫరా చేస్తున్న మున్సిపాలిటీలకు నీటి పన్ను మాత్రం ఆదాయంగా మారడం లేదు. బకాయిలు పేరుకుపోతున్నా.. వసూళ్లలో మాత్రం పురోగతి కనిపించడం లేదు. జిల్లా పరిధిలో ఐదు మున్సిపాలిటీల్లో మొత్తం 55,663 నల్లా కనెక్షన్లు ఉండగా రూ.35.50 కోట్లకు పైగా నీటి పన్ను టార్గెట్ ఉంది.. ఇప్పటివరకు కేవలం రూ.96.06 లక్షలు మాత్రమే వసూలైంది. అంటే మొత్తం టార్గెట్‌లో 2.70 శాతం మాత్రమే ఖజానాకు చేరింది. మిగిలిన మొత్తం బకాయిగా పేరుకుపోయింది.
రూ. 34 కోట్ల బకాయిలు
జిల్లాలోని మున్సిపాలిటీలలో నల్లా పన్ను రూ.34.58 కోట్ల బకాయిలు పేరుకుపోతున్నాయి. ఇంటి పన్నులు వసూళ్ల పై పెట్టిన శ్రద్ధ నల్లా పన్ను వసూళ్ల పై అధికారులు పెట్టడంలేదు. ఇంటి పన్నులు ఇప్పటి వరకు 36.37శాతం వసూలు చేశారు. ఇంటి పన్ను చెల్లించకపోతే మున్సిపాలిటీ వడ్డీని వసూలు చేస్తుంది.... అదే నల్లా పన్నుకు లేకపోవడంతో గృహయజమానులను చెల్లించేందుకు ముందుకు రావడం లేదు.
బకాయిలు పెరుగుతున్నా..
నీటి సరఫరా పొందుతున్న వినియోగదారుల నుంచి పన్ను వసూలు చేయడంలో మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పన్నులే మునిసిపాలిటీలకు ప్రధాన ఆదాయ వనరు. మున్సిపాలిటీలలో పైపులైన్ల నిర్వహణ, మరమ్మతులు, మోటార్లు, విద్యుత్తు ఖర్చులు నిరంతరం ఉంటాయి. కానీ నీటి పన్ను వసూళ్లు అతి తక్కువగా ఉండటంతో మునిసిపాలిటీలకు రావాల్సిన ఆదాయం బకాయిల రూపంలోనే మిగులుతోంది. ఇంటి పన్ను వసూళ్ల పై ఎలా దృష్టి పెడతారో అదేఽ విధంగా నల్లా పన్ను వసూళ్లపై దృష్టి పెడితేఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది.
రూ. 35.50 కోట్ల టార్గెట్
మున్సిపాలిటీ పేరు లక్ష్యం వసూలైంది బకాయి
సిద్దిపేట 2,100.75 76.22 2,024.53
గజ్వేల్ 539.48 8.63 530.85
హుస్నాబాద్ 641.20 2.68 638.52
దుబ్బాక 64.76 1.48 63.28
చేర్యాల 204.0 3.0 201.0
వసూలు చేస్తాం
‘సర్’ ముగిసిన తర్వాత ప్రత్యేక టీంలు వేసి నల్లా పన్నులను వసూలు చేస్తాం. ఇంటి పన్నులు ఎలా వసూలు చేస్తామో అదే విధంగా నల్లా పన్నును వసూలు చేసి మున్సిపల్ ఆదాయాన్ని పెంచుతాం.
– గణేశ్ రెడ్డి, కమిషనర్,
గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ


