బహుళఅంతస్తులు, అపార్ట్‌మెంట్లకూ సాధారణ కనెక్షన్లే మున్సిపాలిటీల్లో మొత్తం 55,663 నల్లాలు.. అందులో కమర్షియల్ 89 మాత్రమే సిద్దిపేటలో 80కి పైగా అపార్టుమెంట్లకు 27 మాత్రమే కమర్షియల్.. భారీగా ఆదాయం కోల్పోతున్న మున్సిపాలిటీలు క్షేత స్థాయిలో దృష్టిసారించని అధికారులు
సిద్దిపేట పట్టణం భారత్‌నగర్‌లోని ఓ అపార్టుమెంట్‌లో నల్లా కనెక్షన్లు ఇచ్చారు. కానీ వాటిని వినియోగించకుండా వదిలేశారు. ఆ అపార్టుమెంట్‌లో ఉన్న ఇంటి నంబర్‌తో మున్సిపాలిటీలో చెక్ చేయించగా అసలు నల్లా కనెక్షన్ లేనట్లుగా ఉంది.
సిద్దిపేట పట్టణంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నాలుగు మున్సిపాలిటీకి చెందిన నల్లాలు బిగించారు. బిల్లులు ఏ ఒక్కదానికి సైతం చెల్లించడం లేదు. ఇలా నల్లా కనెక్షన్లు ఉన్నా పట్టించుకునే వారే కరువైయ్యారు.
ఇష్టారీతిన అక్రమ అనుమతులు
పట్టణాల్లో అపార్ట్‌మెంట్లు.. ఆకాశాన్ని తాకే బహుళ అంతస్తుల భవనాలు.. పెరుగుతున్న నీటి వినియోగం.. కానీ మున్సిపల్ రికార్డుల్లో మాత్రం కమర్షియల్ నల్లా కనెక్షన్ల సంఖ్య అత్యల్పం. పట్టణాల్లో అపార్ట్‌మెంట్లు, వాణిజ్య అవసరాల కోసం మున్సిపల్ నీటిని వినియోగిస్తున్నా వాటిలో చాలా వరకు సాధారణ గృహ వినియోగ కనెక్షన్లుగానే కొనసాగుతున్నాయి. మరికొన్ని చోట్ల నల్లా కనెక్షన్లు ఉన్నప్పటికీ మున్సిపాలిటీ రికార్డుల్లో వాటి వివరాలు నమోదు కావడంతో లేదు.. దీంతో మున్సిపల్ ఆదాయం కోల్పోతోంది.
– సాక్షి, సిద్దిపేట
జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో మొత్తం 55,663 నల్లా కనెక్షన్లు ఉండగా.. అందులో కమర్షియల్ కనెక్షన్లు కేవలం 89 మాత్రమే. మిగిలిన 55,574 సాధారణ కనెక్షన్లు ఉన్నాయి. అపార్ట్‌మెంట్లకు నల్లా కనెక్షన్ కోసం 20 ఫ్లాట్లు ఉంటే రూ.50వేలు అంతకంటే ఎన్ని ఎక్కువ ఉంటే ఒక్కో దానికి రూ.2,500 చొప్పున మున్సిపాలిటీకి చెల్లించి నల్లా కనెక్షన్ పొందాలి. వీరు ప్రతి నెలా రూ.1,500 నల్లా పన్నును మున్సిపాలిటీకి చెల్లించాలి. అదే సాధారణ గృహాలకు అయితే ఉచితంగా కనెక్షన్, నెలకు రూ.150 నల్లా పన్నును వసూలు చేస్తున్నారు.
దుబ్బాక, హుస్నాబాద్, చేర్యాల మున్సిపాలిటీల్లో కమర్షియల్ నల్లా కనెక్షన్లు ఒక్కటీ నమోదు కాలేదు. ఈ మూడు పట్టణాల్లో వాణిజ్య భవనాలు ఉన్నప్పటికీ కమర్షియల్ నల్లాలే లేవని అధికారుల లెక్కలు తెలుపుతున్నాయి. నల్లా కనెక్షన్ అంటే కేవలం నీటి సరఫరా కాదు. దాని వెనుక కనెక్షన్ నమోదు.. కేటగిరీ.. బిల్లింగ్.. వసూళ్లు ఉంటాయి. క్షేత్రస్థాయిలో ఉన్న నల్లా మున్సిపల్ రికార్డుల్లో లేకపోతే.. దానికి బిల్లింగ్ జరుగుతోందా? అన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. సాధారణ కనెక్షన్ కంటే 10 రేట్లు ఎక్కువగా కమర్షియల్ నల్లా పన్ను ఉంటుంది. కమర్షియల్ నల్లాలకు బదులు సాధారణ కనెక్షన్లుగా నమోదు కావడంతో బల్దియాలు ఆదాయాలు కోల్పోతున్నాయి.
వాణిజ్య భవనాలు, అపార్ట్‌మెంట్లకు ఉన్న మున్సిపాలిటీ నల్లా కనెక్షన్లు సాధారణ, కమర్షియల్ కనెక్షన్ల క్షేత్ర స్థాయిలో పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ పరిశీలను ఆయా మున్సిపల్ కమిషనర్లు ప్రత్యేక చొరవ తీసుకుంటే మున్సిపల్ ఆదాయం పెరగడంతో పాటు అక్రమ నల్లా కనెక్షన్ల తేలనున్నాయి. ఇప్పటికై నా ఉన్న అధికారులు స్పందించి అక్రమ నల్లా కనెక్షన్లకు నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు.
మున్సిపాలిటీ సాధారణ నల్లాలు కమర్షియల్ మొత్తం
సిద్దిపేట 27,412 27 27,439
గజ్వేల్ 10,026 62 10,088
దుబ్బాక 7,203 0 7,203
హుస్నాబాద్ 7,218 0 7,218
చేర్యాల 3,715 0 3,715
‘సాక్షి’ పరిశోధనాత్మక కథనం
సిబ్బంది చేతివాటం
కమర్షియల్ నల్లా కనెక్షన్ బదులు సాధారణ కనెక్షన్ ఇస్తూ క్షేత్రస్థాయిలో పలువురు సిబ్బంది, వర్క్ ఇన్‌స్పెక్టర్లు చేతి వాటం ప్రదర్శిస్తున్నారు. పలు చోట్ల సాధారణ నల్లా కనెక్షన్లు నమోదు కాకుండానే నీటిని సరఫరా అవుతున్నాయి. పలు మున్సిపాలిటీలలో కౌన్సిలర్లు తమ పెత్తనంతో నల్లా కనెక్షన్లు ఇప్పిస్తున్నారు. అపార్టుమెంట్‌లు, వాణిజ్య భవనాలు, గృహాల వారి వద్ద డబ్బులను కౌన్సిలర్లు వసూలు చేస్తున్నారని తెలుస్తోంది.
క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తాం
మున్సిపాలిటీ పరిధిలో ఉన్న సాధారణ, కమర్షియల్ నల్లా కనెక్షన్లు ఎక్కడెక్కడ ఉన్నాయో క్షేత్రస్థాయిలో పరిశీలిస్తాం. వాణిజ్య భవనాలకు సాధారణ నల్లా కనెక్షన్ వినియోగించవద్దు. త్వరలో పూర్తి స్థాయిలో సర్వే నిర్వహిస్తాం.
– మల్లికార్జున్, ఇన్‌చార్జి కమిషనర్,
పురపాలక సంఘం, సిద్దిపేట


