ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): ఎస్సీ ఎస్టీ కమిషన్ సమీక్ష సమావేశం మంగళవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించనున్నట్లు జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ అధికారి రాజగంగారామ్ తెలిపారు. మంగళవారం ఉదయం 11గంటలకు సమీక్షా సమావేశం ఉంటుందన్నారు. సమావేశంలో ల్యాండ్, అట్రాసీటీ, ఆర్‌ఓఆర్, బ్యాక్‌లాగ్ ఖాళీలల పై చర్చించనున్నట్లు తెలిపారు. ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్, సభ్యులు, జిల్లా అధికారులు హాజరుకానున్నట్లు తెలిపారు.
కుల వృత్తులను ఆదుకోవాలి
హుస్నాబాద్: ప్రభుత్వం కుల వృత్తులను ఆదుకోవాలని అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొత్తపల్లి సత్యనారాయణ కోరారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, స్వర్ణకార, మేదరి తదితర స్వయం ఉత్పత్తిదారులైన కుల వృత్తుల కార్మికులకు ఉపాధి కల్పించే బాధ్యత ప్రభుత్వం పై ఉందన్నారు. నేటి సమాజంలో టెక్నాలజీ పెరిగిపోయి కుల వృత్తులు అంతరించిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకృతిపరమైన గ్రామీణ చేతి వృత్తులు టెక్నాలజీ తాకిడికి తట్టుకోలేక బతుకులు ఛిద్రమవుతున్నాయని తెలిపారు. సమావేశంలో సంఘ నాయకులు ఎగ్గోజు దామోదర చారి, పోలోజు జనార్దనాచారి, శ్రీమంతుల చంద్రయ్య చారి తదితరులు ఉన్నారు.
ఐలయ్యకు స్వర్ణ కంకణం
చేర్యాల(సిద్దిపేట): మండల పరిధిలోని నాగపురి ఉన్నత పాఠశాల హెచ్‌ఎం ఎలికట్టె ఐలయ్యకు స్వర్ణకంకణం ప్రదానం చేశారు. ఆదివారం హన్మకొండలోని జయకృష్ణ కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించిన విశ్వ కర్మ, తెలుగు వెలుగు జాతీయ పురస్కారాల కార్యక్రమంలో నిర్వాహకులు ఆయనను శాలువాతో సత్కరించి ప్రశంసా పత్రం, స్వర్ణ కంకణం అందజేశారు. తెలుగు, హిందీ, ఇంగ్లిష్, కన్నడ భాషల్లో దేశభక్తి, భక్తి, సామాజిక అంశాలు, విద్య, పర్యాటకం, ఏఐ తదితర అంశాలపై ఆయన చేసిన రచనలకు గుర్తింపుగా ఈ సత్కారం లభించింది.
తీరనున్న నిర్వాసితుల ఇబ్బందులు
గజ్వేల్: వైకుంఠ ధామం, కబ్రస్థాన్‌లు లేక ఆఖరి మజీలీకి ఇబ్బందిపడుతున్న మల్లన్నసాగర్ నిర్వాసిత కాలనీవాసులకు ఇబ్బందులు తీరనున్నాయి. గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలోని ముట్రాజ్‌పల్లి ఏడో వార్డులోగల 297 సర్వేనెంబర్‌లో వెకుంఠధామం నిర్మాణానికి ఎకరా, కబ్రస్థాన్ నిర్మాణానికి మరో ఎకరా భూమిని కేటాయిస్తూ సోమవారం కలెక్టర్ హైమావతి ఆదేశాలు జారీ చేశారు. త్వరలో నిర్మాణాలకు మార్గం సుగమం కానుంది.
ఎరువుల దుకాణంలో తనిఖీలు
చేర్యాల(సిద్దిపేట): మండల పరిధిలోని గుర్జకుంట ఎక్స్‌రోడ్స్‌లోని నాగేంద్ర ఎరువుల దుకాణంలో సోమవారం జిల్లా వ్యవసాయ అధికారి స్వరూపరాణి తనిఖీలు చేపట్టారు. దుకాణంలోని స్టాకు బోర్డు, రికార్డులు, బిల్లు బుక్స్ తదితర వాటిని పరిశీలించారు. గోదాంలో ఉన్న ఎరువు బస్తాల స్టాకుపై ఆరాతీశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఎరువులు, పురుగు మందుల విక్రయాలు జరపాలని, అలా చేయని వారిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు.
ఎంక్వయిరీ సేవలు ప్రారంభం
గజ్వేల్‌రూరల్: జీపీపీ(గజ్వేల్–ప్రజ్ఞాపూర్) ఆర్టీసీ డిపో పరిధితో పాటు తూప్రాన్‌లో ప్రయాణికుల సౌకర్యం కోసం ఎంక్వయిరీ సేవలను ప్రారంభిస్తున్నట్లు మేనేజర్ బద్రి నారాయణ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ గజ్వేల్‌తో పాటు తూప్రాన్ బస్ స్టేషన్‌లలో ఎంక్వయిరీ సేవలు ప్రారంభమైనట్లు తెలిపారు. ప్రతి రోజు ఉదయం 5గంటల నుంచి రాత్రి 9గంటల వరకు ఆర్టీసీ బస్సుల రాకపోకలు, సర్వీస్‌ల వివరాలు, ప్రయాణానికి సంబంధించి గజ్వేల్ బస్‌స్టేషన్ 9030853571, తూప్రాన్ బస్‌స్టేషన్ 7013102493 నంబర్లకు ఫోన్ చేసి తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చన్నారు.


