● కలెక్టర్ హైమావతి ● వచ్చిన అర్జీలు 120
సిద్దిపేటరూరల్: జిల్లా వ్యాప్తంగా ప్రజలు అందించిన అర్జీలను అధికారులు పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని మీటింగ్ హాల్‌లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజలు అందించిన అర్జీలను అదనపు కలెక్టర్ లక్ష్మికిరణ్‌తో కలిసి కలెక్టర్ స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల సమస్యలకు సంబంధించి అందించిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. అర్జీలు పునరావృతం కాకుండా వెంటవెంటనే పరిష్కరించాలన్నారు. వివిధ రకాల సమస్యల పరిష్కారం కోరుతూ మొత్తంగా 120అర్జీలు వచ్చాయి. కార్యక్రమంలో డీఆర్‌ఓ నాగరాజమ్మ, ట్రైనీ డిప్యూటి కలెక్టర్ భవ్య, ప్రత్యేక అదనపు కలెక్టర్ సుదర్శన్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
గ్రానైట్ క్యారీకి అనుమతి ఇవ్వొద్దు
అక్కన్నపేట(హుస్నాబాద్): రేగొండ, గోవర్థనగిరి గ్రామాల రెవెన్యూ పరిధిలోని పరికిబండ వద్ద గ్రానైట్ క్వారీకు అనుమతులు ఇవ్వొద్దని పాలకవర్గం సభ్యులు కోరారు. ఈ మేరకు గ్రామ సర్పంచ్ పెండ్యాల రమ ఆధ్వర్యంలో జిల్లా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రానైట్ క్వారీ ఏర్పాటైతే శబ్ధాలు, పర్యావరణ కాలుష్యం, పంట పొలాలకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. ఈ పరికిబండ గుట్టలో నెమళ్లు, కుందేళ్లు, కోతులు, ఎలుగుబంట్లు ఆవాసం ఏర్పాటు చేసుకున్నాయన్నారు. కార్యక్రమంలో గ్రామ పాలకవర్గం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


