సిద్దిపేటజోన్: ప్రతి ఒక్కరి జీవితంలో క్రీడలు ఒక భాగం కావాలని జిల్లా ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ భవ్య పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య(ఎస్‌జీఎఫ్)ఆధ్వర్యంలో 70వ జిల్లా స్థాయి కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ టోర్నీని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా భవ్య మాట్లాడుతూ.. క్రీడల వల్ల క్రమశిక్షణతో పాటు శారీరక మానసిక పునరుత్తేజం, నమ్మకం కలుగుతుందన్నా రు. ఆటలు భవిష్యత్తులో కూడా ఆడి అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఆరోగ్యమే మహాభాగ్యం అనే సూక్తికి అనుగుణంగా ఆటలు ఎంతో ముఖ్యమన్నారు. అదేవిధంగా కలిసి ఆటలు ఆడటంతో స్నేహభావం, నమ్మకం ఏర్పడుతుందన్నారు. జిల్లాకు మంచి పేరు తేవాలని, ఆటలో క్రీడా స్ఫూర్తితో ఉండాలని, గెలుపు ఓటములు సహజంగా తీసుకోవాలని సూచించారు. ఈ పోటీల్లో జిల్లాలోని వివిధ పాఠశాలలు విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్, పంచాయతీ రాజ్ శాఖ అధికారి రవీందర్, జిల్లా క్రీడల యువజన శాఖ అధికారి వీరారెడ్డి, వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు, వ్యాయామ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
ఎస్‌జీఎఫ్‌లో చోరీ
పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు
సిద్దిపేటజోన్: జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య ఆఫీసులో చోరీ జరిగింది. ఆదివారం గుర్తు తెలి యని వ్యక్తులు స్టేడియం పరిసరాల్లో ఉన్న ఎస్‌జీఎఫ్ కార్యాలయం తాళం పగులకొట్టి బీరువాలో ఉన్న కాగితాలు దొంగిలించారు. ఇదే విషయాన్ని ఎస్‌జీఎఫ్ మాజీ సెక్రటరీ ఒకరు మంగళవారం వన్ టౌన్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మరోవైపు జిల్లా కేంద్రంలో ప్రస్తుతం జరుగుతు న్న జిల్లా స్థాయి టోర్నీలో డిప్యుటేషన్ విధుల అంశంపై సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. ఎస్జీఎఫ్‌లో రెండు వర్గాల మధ్య ఉన్న ఆధిపత్య పోరులో భాగంగానే సంఘటనలు చోటుచేసుకునట్లు ప్రచారం జరుగుతోంది.


