● సీపీ రష్మీ పెరుమాళ్ ● జిల్లా వ్యాప్తంగా 3వేలకు పైగా విగ్రహాలు
హుస్నాబాద్: గణేశ్ ఉత్సవాలు భక్తి, శాంతి, సోదరభావానికి ప్రతీకగా నిలుస్తాయని సీపీ రష్మీ పెరుమాళ్ అన్నారు. మంగళవారం పట్టణంలో నిమజ్జన బందోబస్తు పరిశీలనలో భాగంగా ఎల్లమ్మ చెరువు వద్ద ఏర్పాటు చేసిన నిమజ్జన పాయింట్‌ను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఎల్లమ్మ చెరువులో నూతనంగా నిర్మించిన గ్లాస్ బ్రిడ్జిని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పట్టణంలోని పలు వినాయక మండపాళ్లను సందర్శించారు. ఈ సందర్భంగా సీపీ రష్మీ పెరుమాళ్ మాట్లాడుతూ జిల్లాలో మూడు వేలకు పైగా వినాయక విగ్రహాలను ప్రతిష్టించారని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా గణేష్ నిమజ్జన కార్యక్రమాలు నిర్వహించనున్న నేపథ్యంలో అధికారులు ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. శోభయాత్ర సమయంలో పట్టణంలో రద్దీ ఏర్పడకుండా వాహన రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు, ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించాలని ఏసీపీ సదానందంపు ఆదేశించారు. ఎలాంటి డీజేలు లేకుండా భక్తి శ్రద్దలతో పండుగను జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఏసీపీ సదానందం, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, సీఐ శ్రీధర్, ఎస్సై లక్ష్మారెడ్డిలు ఉన్నారు.


