హుస్నాబాద్: యువత డ్రగ్స్‌కు బానిసై జీవితాలను నాశనం చేసుకోవద్దని డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ, జడ్జి సౌజన్య అన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ ఎవరైనా డ్రగ్స్ వాడినా, కలిగి ఉన్నా, అమ్మినా సుమారు 6 నెలల నుంచి పదేళ్ల నాన్ బెయిలబుల్ జైలు శిక్షతో పాటు జరిమానా విధించే అవకాశం ఉందని తెలిపారు. బాగా చదువుకొని వివిధ రంగాలలో, వివిధ హోదాలలో స్థిరపడాలని సూచించారు. కార్యక్రమంలో హుస్నాబాద్ జడ్జి ప్రమిద, కళాశాల ప్రిన్సిపాల్ భిక్షపతి, అధ్యాపకులు బాలరాజు, కుమారస్వామి, విజయ, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
రూ.4.44 కోట్లు చెల్లించకుంటే ఆస్తుల జప్తు
రైస్ మిల్లర్లకు తహసీల్దార్ కృష్ణమోహన్ హెచ్చరిక
దుబ్బాకటౌన్: రాయపో ల్ మండలం రామారం లోని మహదేవ్ ఆగ్రో రైస్ ఇండస్ట్రీస్ యాజమాన్యం ప్రభుత్వ వరి ధాన్యం నిల్వలను దుర్వినియోగం చేయడంతో రూ.4,44,15,348 నష్టం వాటిల్లిందని తహసీల్దార్ కృష్ణమోహన్ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. ఈ మొత్తాన్ని ఏడు రోజుల్లోగా చెల్లించాలని సంబంధిత రైస్‌మిల్లు యజమానులకు నోటీసు జారీ చేశామన్నారు. ప్రభుత్వ ధాన్యం 12,708.90 క్వింటాళ్లు దుర్వినియోగమైనట్లు అధికారులు నిర్ధారించినట్లు దీంతో.. సంబంధిత రైస్ మిల్లర్లకు నోటీసులో ఇచ్చామన్నారు. నష్టపరిహారం మొత్తాన్ని నిర్ణీత గడువులోగా ప్రభుత్వానికి చెల్లించాలని ఆదేశించారు. గడువులోగా నష్టపరిహారం చెల్లించని పక్షంలో రెవెన్యూ రికవరీ (ఆర్‌ఆర్) చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్థిర, చరాస్తులను జప్తు చేసి, వేలం ద్వారా ప్రభుత్వ బకాయిలను రికవరీ చేస్తామని స్పష్టం చేశారు.
ప్లాస్టిక్ రహితం..
అరిటాకులో భోజనం
ఆదర్శంగా మైలారం సిద్ధివినాయక బృందం
వర్గల్(గజ్వేల్): గణనాథుల నవరాత్రోత్సవాల సందర్భంగా అన్నదానాలు జోరందుకున్నా యి. అన్నదానం అనగానే ప్లాస్టిక్ పేపర్ ప్లేటులో భోజనం, ప్లాస్టిక్ గ్లాసులో నీళ్లు గుర్తుకొస్తాయి. ప్లాస్టిక్ వాడకం పర్యావరణానికి, మానవాళి ఆరోగ్యానికి హానికరమని తెలిసినా వాటి వాడకం తగ్గడం లేదు. కాని వర్గల్ మండలం మైలారంలోని సిద్ధివినాయక భక్త బృందం ప్లాస్టిక్ జోలికి వెళ్లకుండా అన్నదాన క్రతువు నిర్వహించి సమాజానికి సరికొత్త సందేశం పంచింది. వినాయక మండపం వద్ద చక్కగా టేబుళ్లు ఏర్పాటుచేసి, కుర్చీలు వేసి అరటి ఆకులలో భోజనం పెట్టారు. స్టీల్ గ్లాసులలో నీళ్లు ఏర్పాటుచేశారు. పదేళ్లుగా ప్రతి సంవత్సరం ఎకో ఫ్రెండ్లీ మట్టి వినాయక ప్రతిమను పూజిస్తున్నారు. తాము ఆచరిస్తూనే ‘పర్యావరణాన్ని కాపాడుకుందాం’ అంటూ సిద్ధివినాయక బృంద సభ్యులు పదుగురికి సందేశం పంచుతున్నారు.
హెచ్‌ఏసీఏ సెంటర్‌తో మేలు
ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి
కొండపాక(గజ్వేల్): ఎరువుల విక్రయాల్లో ఇబ్బందులు రాకుండా హెచ్‌ఏసీఏ సెంటర్ దోహదపడుతుందని ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి అన్నారు. కుకునూరుపల్లి మండలంలోని రాయవరంలో సోమవారం హెచ్‌ఏసీఏ ఎరువుల విక్రయ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా యాదవరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎరువులను యాప్‌లలో బుకింగ్ చేసుకునే విధానాన్ని ప్రవేశపెట్టడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. రాయవరంలో అలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకు హెచ్‌ఏసీఏ కేంద్రం ఉపయోగపడుతుందన్నారు. ఇలాంటి సెంటర్లు మండల వ్యాప్తంగా ఏర్పాటు అయ్యేలా కృషి చేస్తామన్నారు.


