కొండపాక(గజ్వేల్): మండలంలోని వెలికట్ట శివారులోని 271 సర్వేనంబరులో 327.09 ఎకరాల ప్రభుత్వ భూమి గుర్తింపు కోసం అధికారులు సోమవారం సర్వే పనులు చేపట్టారు. రాజీవ్ రహదారికి ఆనుకొని ఉన్న ప్రభుత్వ భూమి కొలతలు పారదర్శకంగా ఉండేందుకు గజ్వేల్ డివిజన్ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ వంశీ ఆధ్వర్యంలో 16 మంది సర్వేయర్ల బృందం కొలతలు వేసే పనులు చేపట్టారు. ఇటీవల ఈసర్వే నంబరులోని సుమారు 6 ఎకరాల పైచిలుకు భూమి ప్రభుత్వ నిబంధనలను ఉల్లంగించి ఇతరుల పేరిట పట్టా మార్పిడీలు చేశారన్న విషయమై అసెంబ్లీలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రస్తావించిన విషయం తెలిసిందే. ఈనేఫథ్యంలో సర్వేయర్లు బృందం 327.09 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించి హద్దులు పెట్టే పనులు మొదలు పెట్టారు. కార్యక్రమంలో సర్వేయర్ల బృందం, జీపీఓలు తదితరులు పాల్గొన్నారు.


