పని పిసరంత.. వివాదాలు బోలెడంత | - | Sakshi
Sakshi News home page

పని పిసరంత.. వివాదాలు బోలెడంత

Sep 22 2026 10:08 AM | Updated on Sep 22 2026 10:08 AM

ఎనిమిది నెలల పాలన ఆరోపణల మయం ఇళ్ల నిర్మాణాల అనుమతుల పేరిట రచ్చ

మున్సిపాలిటీకి యూఐడీఎఫ్‌ కింద రూ.18.7 కోట్ల పనులు వచ్చాయి. ఇందులో రూ.15 కోట్ల పనులకు టెండర్‌ పూర్తయ్యింది. కానీ బిల్లులు వస్తాయో.. రావోనని పనులు చేపట్టకుండా కాంట్రాక్టర్‌లు చేతులెత్తేశారు. ఈ పనులను పట్టాలెక్కించడానికి మున్సిపల్‌ ఉన్నతాధికారులను కలిసే ప్రయత్నం పాలకవర్గం ఇప్పటికీ చేయలేదు.

ఫాగింగ్‌ యంత్రాలు సరిపడనంతలేక, పట్టణంలో ఫాగింగ్‌ సాగక వ్యాధుల వ్యాప్తి పెరుగుతోంది. అయినా పట్టింపు లేదు.

సరిపడా చెత్త వాహనాల్లేవు. ఫలితంగా చెత్త సేకరణ సక్రమంగా సాగటం లేదు. సొంత జెట్టింగ్‌ యంత్రం లేక..యూజీడీ నిర్వహణ అధ్వానంగా మారింది.

మున్సిపాలిటీలో పన్నుల వసూలు సక్రమంగా సాగక.. పట్టణానికి రావాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులు రాలేదు. ఈ సమస్యను ఈసారి అధిగమించే ప్రయత్నం జరగటం లేదు. ఇవే కాదు ఎన్నో ఇబ్బందులు పట్టణంలో తిష్టవేశాయి. వీటి పరిష్కరించడానికి కలిసికట్టుగా పనిచేద్ధామనే ఆలోచన పాలకవర్గంలో మచ్చుకై నా కనిపించడం లేదు.

గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీలో ముసలం మొదలైంది. పాలకవర్గం ఐక్యంగా ముందుకుసాగి.. చేసిన పని ఒక్కటీ లేకపోగా, వివాదాలు మాత్రం బోలెడన్నీ మూటగట్టుకుంది. ఇళ్ల నిర్మాణాల అనుమతులు, పనుల అడ్డగింత పేరిట పాలకవర్గ సభ్యుల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. ఒకరిపై మరొకరు తీవ్రమైన ఆరోపణలు చేసుకోవడం చర్చనీయాంశంగా మారుతోంది. – గజ్వేల్‌

మున్సిపాలిటీలోని 20వార్డుల్లో ఇండిపెండెంట్‌తో కలుపుకొని 12 స్థానాలను దక్కించుకున్న బీఆర్‌ఎస్‌.. చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్‌పర్సన్‌ పీఠాలను కై వసం సంగతి తెల్సిందే. రెండు కీలకమైన పదవులు మహిళలను చేపట్టడం వల్ల సహజంగానే వారి పతుల పెత్తనం కొనసాగుతోంది. మహిళా కౌన్సిలర్లు ఉన్నా భర్తల పెత్తనం కొనసాగుతోంది.

దూషణల పర్వమే..

ఇళ్ల నిర్మాణాల అనుమతులు, పనుల అడ్డగింత పేరిట పాలకవర్గ సభ్యులు మధ్య రచ్చ కొనసాగుతోంది. ఈ రచ్చ పరస్పరం దూషించుకోవడమే కాదు.. ఘర్షణకు పాల్పడే వాతావరణం నెలకొంది. ప్రధాన కౌన్సిలర్‌ భర్త, మరో కౌన్సిలర్‌ మధ్య ఇదే అంశంలో మున్సిపల్‌ కార్యాలయంలోనే ఇటీవల తీవ్రంగా గొడవపడటం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. ఇకపోతే పట్టణంలోని వక్ఫ్‌ స్థలాలు, ప్రభుత్వ భూముల్లో కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలు, అనుమతిలేకుండా సాగుతున్న అదనపు నిర్మాణాల్లో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని కౌన్సిలర్లు ఒకరిపై మరొకరు తీవ్రంగా ఆరోపణలు చేసుకుంటున్నారు. తాము ఏదైనా పనిమీద మున్సిపల్‌ కార్యాలయానికి వస్తే సీసీ కెమెరాలతో నిఘా పెట్టి.. ఆ పనులు కాకుండా అపుతున్నారని ప్రధాన కౌన్సిలర్‌ భర్తపై కొందరు కౌన్సిలర్లు ఆరోపణలు చేస్తున్నారు. బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్ల మధ్య వివాదం చిలికిచిలికి గాలి వానలా మారుతూ పార్టీ పెద్దలకు తలనొప్పిగా మారింది. ఈ నేపథ్యంలో మున్సిపల్‌ పాలకవర్గంలో సయోధ్య ఎప్పుడు కుదురుతుందో తెలియని పరిస్థితి నెలకొన్నది.

గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌ మున్సిపల్‌ పాలకవర్గంలో ముసలం

ఎన్నో సమస్యలు...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement