న్యూస్‌రీల్
శిక్షణ కోసం చెరువులకు వెళ్తున్న క్రీడాకారులు గతంలో జాతీయ స్థాయి స్విమ్మింగ్ పోటీలకు వేదిక పట్టించుకోని అధికారులు
మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంతో సిద్దిపేటలోని స్విమ్మింగ్ పూల్ నిరుపయోగంగా మారింది. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించినా నిరాధరణకు గురవుతోంది. ఏడాదిన్నరగా తెరుచుకోక కంపుకోడుతోంది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి స్విమ్మింగ్ పూల్‌ను తెరిపించాలని క్రీడాకారులు, పట్టణ ప్రజలు కోరుతున్నారు. – సాక్షి, సిద్దిపేట
2016లో రూ. 5 కోట్ల వ్యయంతో 50 మీటర్ల పొడవు, 25 మీటర్ల వెడల్పుతో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక చొరవతో సిద్దిపేటమినీ స్టేడియానికి సమీపంలో స్విమ్మింగ్ పూల్ నిర్మించారు. అలాగే బేబీ స్విమ్మింగ్ పూల్‌ను సైతం నిర్మించారు. ప్రారంభంలో జాతీయ స్థాయి స్విమ్మింగ్ పోటీలు సైతం నిర్వహించారు. కరోనా కాలంలో కొన్ని రోజులు మూత పడినా.. కొన్ని రోజులు మున్సిపల్ ఆధ్వర్యంలో నిర్వహణ కొనసాగింది. తర్వాత జిల్లా యువజన క్రీడా శాఖ ఆధ్వర్యంలో నాలుగేళ్లు ప్రైవేట్ కాంట్రాక్టర్ కొనసాగించినా, గతేడాది ఏప్రిల్‌లో నిర్వహణ బాధ్యతలు మున్సిపాలిటీకి అప్పగించారు. ఇదిలాఉండగా గతంలో కాంట్రాక్ట్ పొందిన వారు డబ్బులు చెల్లించకపోయినా చర్యలు తీసుకోవడం గమనార్హం.
క్రీడాకారులకు శిక్షణ కరువు
సిమ్మింగ్ పూల్ నిర్వహణ కొరవడటంతో శిక్షణ తీసుకునే విద్యార్థులు, క్రీడాకారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. త్వరలో రాష్ట్రస్థాయి జూనియర్, సబ్ జూనియర్, సీనియర్ పోటీలు హైదరాబాద్‌లో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాకు చెందిన క్రీడాకారులు పలువురు కోమటిచెరువు, రంగనాయకసాగర్, మరికొందరు హైదరాబాద్, వరంగల్, సంగారెడ్డిలలో శిక్షణ పొందుతున్నారు.
ఆరు నెలలైనా అంతే!
జిల్లా యువజన క్రీడల శాఖ నుంచి సిద్దిపేట మున్సిపాలిటీకి ఈ ఏడాది ఏప్రిల్‌లో కలెక్టర్ అప్పగించారు. మున్సిపాలిటీకి అప్పగించి ఆరు నెలలు అవుతున్నా ఇప్పటివరకు అటు వైపు అధికారులు చూడలేదు. గత వేసవిలో అందుబాటులోకి తీసుకవస్తారేమో అని పట్టణ వాసులు ఎంతో ఆశగా ఎదురుచూశారు. కానీ ఎలాంటి మరమ్మతులు చేపట్టలేదు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా కోట్లు పెట్టి నిర్మించిన స్విమ్మింగ్ పూల్ నిరాధరణకు గురవుతోంది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి అందుబాటులోకి తీసుకురావాలని క్రీడాకారులు, పట్టణ వాసులు కోరుతున్నారు.
మూత పడిన స్విమ్మింగ్ పూల్
అద్దాలు పగిలి, డోర్లు లేకుండా..
దుర్వాసన.. చెత్త, గడ్డి
ఏడాదిన్నరగా స్విమ్మింగ్ పూల్‌ను ఓపెన్ చేయకపోవడంతో దుర్వాసనతో కంపుకొడుతోంది. వర్షపు నీరు, చెత్త చెదారంతో నిండిపోయింది. ఎయిర్ బాల్స్ దండ అంతా తెగిపోయింది. మోటార్లను నిర్లక్ష్యంగా బయటనే పడేయడంతో పాడయ్యాయి. పూల్ ఆవరణలో గడ్డి ఏపుగా పెరిగింది. గత కొన్ని నెలలుగా విద్యుత్ బిల్లు బకాయి ఉంది. స్విమ్మింగ్ పూల్ చుట్టూ పక్కల నివాసం ఉండేవారు దోమలు, దుర్వాసనతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.


