అసైన్డ్‌ భూమికి ఎసరు | - | Sakshi
Sakshi News home page

అసైన్డ్‌ భూమికి ఎసరు

Aug 24 2026 7:27 AM | Updated on Aug 24 2026 7:27 AM

కాసాల శివారులో కబ్జా

రూ. 20 కోట్ల విలువైన భూమి అక్రమార్కుల పరం

చోద్యం చూస్తున్న అధికారులు

హత్నూర(సంగారెడ్డి): రూ. కోట్లు విలువ చేసే అసైన్డ్‌ భూమికి కొందరు అక్రమార్కులు ఎసరుపెట్టారు. సుమారు 9 ఎకరాలను కబ్జా చేసి దర్జాగా పంటలు సాగు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు చోద్యం చూస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. హత్నూర మండలం కాసాల శివారులో పట్టా భూమికి ఆనుకొని ఉన్న ప్రభుత్వ భూమిని కొందరు తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. గ్రామ శివారులోని సర్వే నంబర్లు 226, 227లో 48 ఎకరాల పట్టా భూమి ఇతర ప్రాంతానికి చెందిన పెద్దలు కొనుగోలు చేశారు. ఈ భూమిలో మామిడి తోటతో పాటు వరి, కూరగాయల సాగు చేస్తున్నారు. అయితే దీనికి ఆనుకొని ఉన్న సర్వే నంబర్‌ 336లోని సుమారు 9 ఎకరాల ప్రభుత్వ భూమిని సైతం ఆక్రమించినట్లు పలువురు ఆరోపిస్తున్నారు. సంగారెడ్డి–దౌల్తాబాద్‌ జాతీయ రహదారికి సమీపంలో ఉండటంతో ఈ భూమికి ప్రస్తుత మార్కెట్‌ విలువ సుమారు రూ.20 కోట్ల వరకు ఉంటుందని సమాచారం.

ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యం

ప్రభుత్వ భూమి ఆక్రమణపై పలుమార్లు రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. అయినా ఇప్పటివరకు పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోలేదని వాపోతున్నారు. రూ. కోట్ల విలువైన ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమవుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సర్వే నంబర్‌ 336లోని ప్రభుత్వ భూమిపై సమగ్ర విచారణ చేపట్టాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి ఆక్రమణకు గురైనట్లు తేలితే వెంటనే ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలని కోరుతున్నారు. ఇదే విషయమై తహసీల్దార్‌ షేక్‌ పర్వీన్‌ వివరణ కోరగా.. సంగారెడ్డి– దౌల్తాబాద్‌ రహదారికి పక్కన ఉన్న మామిడి తోటలో అసైన్డ్‌ భూమి కబ్జాకు గురైన విషయం తమ దృష్టిలో ఉందని తెలిపారు. వారం క్రితం సర్వే చేసి నివేదిక ఇవ్వాలని సర్వేయర్‌ను ఆదేశించినట్లు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement