● మంత్రి పొన్నం ప్రభాకర్ ● కోహెడలో పలు గ్రామాల్లో మంత్రి పర్యటన
కోహెడరూరల్(హుస్నాబాద్): గ్రామాలను అన్ని రంగాలుగా అభివృద్ధి చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కోహెడ మండలం శనిగరం, తంగళపల్లి, గుండారెడ్డిపల్లి, కూరెళ్ల, వెంకటేశ్వరపల్లి గ్రామాల్లో ‘పల్లె పల్లెకు పొన్నం.. పల్లె పల్లెలో ప్రజాపాలన’ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా శనిగరం గ్రామంలో రూ.20లక్షల వ్యయంతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. అలాగే అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై గ్రామ పంచాయతీ వద్ద ప్రజల సమక్షంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామ ప్రజలు, రైతులు, మహిళా సంఘాల ప్రతినిధుల నుంచి సమస్యలు, వినతిపత్రాలను స్వీకరించి సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శనిగరం గ్రామానికి 46 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, రెండో దశలో మరిన్ని ఇళ్లు మంజూరు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్‌కార్డులు అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. స్మార్ట్ రేషన్‌కార్డుల పంపిణీ జరుగుతోందన్నారు. శనిగరం ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందించడం, గంగమ్మ కాలువ, బెజ్జంకి కాలువల సీసీ పనులు పూర్తి చేయడం వంటి అంశాలను సర్పంచ్ లింగంపల్లి లక్ష్మయ్య మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.అలాగే తంగళ్లపల్లిలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో మంత్రి పాల్గ్గొన్నారు. ఈ సందర్భంగా రూ.43 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన అంతర్గత సీసీ రోడ్లను ప్రారంభించారు. అనంతరం గుండారెడ్డిపల్లి, కూరెళ్ల, వెంకటేశ్వరపల్లిగ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి.. ఆయా గ్రామాల సమస్యలు తెలుసుకొని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మిప్రసన్న, సర్పంచ్‌లు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


