రిజర్వాయర్లు నింపండి | - | Sakshi
Sakshi News home page

రిజర్వాయర్లు నింపండి

Aug 12 2026 8:00 AM | Updated on Aug 12 2026 8:00 AM

తాగు, సాగు నీటి కొరత లేకుండా చూడాలి

కలెక్టర్‌, ఇరిగేషన్‌ సలహా కమిటీలకు ఎమ్మెల్యే హరీశ్‌రావు లేఖ

సిద్దిపేటజోన్‌: ‘గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఈసారి ఎల్‌నినో ప్రభావంతో 65శాతం మందే వానాకాలం పంటలు సాగు చేశారు. మిగతా రైతులు సాగునీరు లేదని బీడు భూములుగా ఉంచారు. ప్రస్తుతం సాగు అవుతున్న పంటలు గట్టెక్కేందుకు రిజర్వాయర్లు నింపడమే శరణ్యమని’ మాజీ మంత్రి హరీశ్‌రావు కలెక్టర్‌, నీటిపారుదల శాఖ సలహా కమిటీకి బహిరంగంగా లేఖ రాశారు. కలెక్టరేట్‌లో మంగళవారం నీటిపారుదల సలహా కమిటీ సమావేశం సందర్భంగా లేఖ ద్వారా పలు సూచనలు, అంశాలను కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో జిల్లా కమిటీ ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసిన సందర్భంగా కొన్ని సూచనలు, అంశాలను లేఖ రూపంలో తెస్తున్నట్టు పేర్కొన్నారు. జిల్లాలోని రిజర్వాయర్లలో తక్షణం 30 టీఎంసీల నీటిని ఎత్తిపోయడం వల్ల వచ్చే వానాకాలం వరకు రైతులకు, ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఉంటుందన్నారు. అవసరమైన నీటిని వేసవికాలంలో కూడా మిడ్‌ మానేరు ద్వారా ఎత్తిపోయడం కోసం చర్యలు తీసుకోవాలని సూచించారు. అన్నపూర్ణ, రంగనాయక సాగర్‌ రిజర్వాయర్లలో ప్రస్తుతం డెడ్‌ స్టోరేజ్‌ ఉందని, వాటిని వెంటనే నింపాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రతి సంవత్సరం ఇప్పటికే రాజన్న సిరిసిల్ల జిల్లా మిడ్‌ మానేరు ద్వారా నీటిని ఎత్తిపోయడం జరిగేదని గుర్తు చేశారు. ఇప్పటికీ ఈసారి ఇంకా ఎత్తిపోతల ప్రక్రియ ప్రారంభం కాలేదన్నారు. జూలై 2027 వరకు ఎల్‌నినో ప్రభావం ఉంటుందని ప్రభుత్వం చెబుతోందని, అప్పటివరకు తాగు, సాగునీరు కొరత రాకుండా ఉండాలంటే ఇప్పటికై నా రిజర్వాయర్లకు ఎత్తిపోతల ప్రక్రియ చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాలో సుమారు 6నుంచి7 టీఎంసీల నీటిని తాగునీటి అవసరాలకే వినియోగించుకోవాల్సి ఉంటుందని, వరి, పామాయిల్‌ ఇతర పంటలు సాగుచేసిన రైతులు నీటి ఎత్తిపోతల కోసం ఎదురుచూస్తున్నారన్నారు. జిల్లాలోని రైతులకు ఏ కష్టం రాకుండా వ్యవసాయ, నీటిపారుదల శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement