ఎల్‌నినోతో లోటు వర్షపాతం l కలెక్టర్ హైమావతి
సిద్దిపేటరూరల్: ఎల్‌నినోతో లోటు వర్షపాతం దృష్ట్యా రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలని కలెక్టర్ హైమావతి అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని మీటింగ్ హాలులో జిల్లా స్థాయి ఇరిగేషన్ అడ్వయిజరీ కమిటీ సమావేశాన్ని కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావం వల్ల జిల్లాలోని ప్రాజెక్టులలో కొత్తగా నీరు చేరలేదన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటిని తాగు అవసరాలకు వినియోగించనున్నట్లు తెలిపారు. అందువల్ల వరి పంటలు పండించరాదన్నారు. గత సంవత్సరం 4.82 లక్షల ఎకరాల్లో పంట వేయగా వాటిలో 3.68 లక్షల ఎకరాలలో వరి పంట పండించినట్లు తెలిపారు ఈ యేడు అవగాహన కల్పించిన క్రమంలో నేటికీ 70వేల ఎకరాల్లో పంట మార్పిడి జరిగి కందులు, పెసర్లు, మినుములు, చిరుధాన్యాలు, మొక్కజొన్న, పత్తి తదితర పంటలు వేశారన్నారు. ఆగస్టు 15 తర్వాత ఆముదం, పత్తి, నూనె గింజల పంటలను పండించవచ్చన్నారు. వర్షాలు కురిస్తే ప్రాజెక్టు ద్వారా నీటిని విడుదల చేయడానికి ఇరిగేషన్‌శాఖ సిద్ధంగా ఉందన్నారు. అనంతరం ఎమ్మెల్సీ యాదవరెడ్డి మాట్లాడుతూ వర్షాబావ పరిస్థితుల్లో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని, ప్రాజెక్టుల ద్వారా నీటిని వదిలితే వ్యవసాయం చేసుకుంటారని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే హరీశ్‌రావు పంపిన లేఖను కలెక్టర్ హైమావతి చదివి వినపించారు. గోదావరి నంది నుంచి నీరు వృథా పోకుండా లిఫ్ట్ చేసి ప్రాజెక్టులను నింపి సాగు నీరు అందించి అదుకోవాలని ప్రభుత్వాన్ని కోరినట్లు లేఖలో పేర్కొన్నట్లు తెలిపారు. అంతకుముందు అన్నపూర్ణ సాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్, శనిగరం ప్రాజెక్టులలోని నీటి సామర్థ్యం ఉన్న నిల్వలపై ఇరిగేషన్ అధికారులు వివరించారు.కార్యక్రమంలో కరీంనగర్ సర్కిల్ సీఈ సత్యనారాయణరెడ్డి, సిద్దిపేట, గజ్వేల్, కరీంనగర్ సర్కిల్ ఎస్‌ఈలు సూర్యకిరణ్, లక్ష్మణ్, పల్లంరాజు, జిల్లా ఇరిగేషన్ అధికారి నాగరాజు, ఆర్డీఓలు సదానందం, చంద్రకళ, రామ్మూర్తి, డీఏఓ మల్లయ్య, ఉద్యానశాఖ అధికారి సువర్ణ తదితరులు పాల్గొన్నారు.


