న్యూస్‌రీల్
పెరగనున్న పంట సాగు పెట్టుబడి పీఏసీఏఎస్‌లలో యూరియా నో స్టాక్ బోర్డులు
గురువారం శ్రీ 23 శ్రీ జూలై శ్రీ 2026
సాక్షి, సిద్దిపేట/మెదక్ జోన్/సంగారెడ్డి జోన్: ఉమ్మడి మెదక్ జిల్లాలోని మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల రైతాంగంపై ఎరువుల ధరల పెంపు తీవ్ర ఆర్థిక భారాన్ని మోపింది. వానాకాలం ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన సమయంలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలు అన్నదాతలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. కాంప్లెక్స్ ఎరువుల ధరల పెంపుతో పాటు, యూరియాపై ఉచిత రవాణ సదుపాయాన్ని ఎత్తివేయడం మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా మారింది.
కాంప్లెక్స్ ఎరువుల ధరల భారం
ఖరీఫ్ ప్రారంభంలోనే కేంద్ర ప్రభుత్వం డీఏపీ/కాంప్లెక్స్ ఎరువుల ధరలను విపరీతంగా పెంచింది.
యూరియా రవాణ చార్జీల మోత
గతంలో రేక్ పాయింట్ల నుంచి పీఏసీఎస్‌లు, డీసీఎంఎస్‌లు, హాకా, ప్రైవేట్ డీలర్లకు యూరియా రవాణ చేసేందుకు మార్క్‌ఫెడ్ ఉచిత రవాణ సదుపాయాన్ని అందించేది. కానీ, ఇటీవల ఈ నిర్ణయాన్ని మార్చుకుని రవాణ ఖర్చులను విక్రయదారులే/రైతులే భరించాలని ఆదేశాలు జారీ చేసింది.
విక్రయ కేంద్రాల్లో ‘నో స్టాక్’బోర్డులు
ఈ కొత్త నిర్ణయంతో క్షేత్రస్థాయిలో తీవ్ర గందరగోళం నెలకొంది. యూరియా ఎంఆర్‌పీ బస్తాపై రూ.266 అని ముద్రించి ఉండటంతో, రవాణ చార్జీలు కలిపి రూ.320కి అమ్మితే రైతులు బిల్లుల గురించి ప్రశ్నిస్తే వారికి ఏం సమాధానం చెప్పాలనే సంశయంతో పీఏసీఎస్ సిబ్బంది, ప్రైవేట్ డీలర్లు స్టాక్ తెప్పించేందుకు వెనుకంజ వేస్తున్నారు.
నోడల్ ఏజెన్సీగా మార్క్‌ఫెడ్
రాష్ట్రంలో యూరియాతోపాటు ఇతర ఎరువుల పంపిణీకి మార్క్‌ఫెడ్ నోడల్ ఏజెన్సీగా ఉంది. రైతులకు సకాలంలో యూరియా అందడంతో పాటు నిర్ణయించిన ధరకు లభించేలా మార్క్‌ఫెడ్ నుంచి పీఏసీఎస్, ఏఆర్‌ఎస్, డీసీఎంస్, హాకా కేంద్రాలకు ప్రభుత్వమే రవాణ చార్జీలు భరించి పంపించేవారు. ఇటీవల రవాణ చార్జీలను విక్రయించే వారే భరించాలని నిర్ణయించింది.
బస్తాపై రూ.50 పెంపు
‘నో స్టాక్’బోర్డుల దర్శనం
జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రంగానికి చెందిన విక్రయ కేంద్రాలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో ‘నో స్టాక్’బోర్డులు వెలిశాయి. ఇటీవల కురిసిన వర్షాలకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వరి నాట్లు, ఆరుతడి పంటల సాగు వేగవంతమైన నేపథ్యంలో పైరుకు యూరియా వేయాల్సిన సరైన సమయంలో ఎరువుల ధరలు పెరిగిపోవడం, డీలర్లు సరఫరా నిలిపివేయడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఎల్‌నినో భయాలు, డీజిల్ ధరల పెంపు, దుక్కి ఖర్చులతో అల్లాడుతున్న రైతన్నను ఆదుకోవడానికి ప్రభుత్వం వెంటనే స్పందించాలి. రద్దు చేసిన ఉచిత యూరియా రవాణ ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని, అలాగే కాంప్లెక్స్, యూరియా ఎరువుల ధరలను తగ్గించి పంట సాగు పెట్టుబడి భారాన్ని తగ్గించాలని ఉమ్మడి జిల్లా రైతాంగం ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తోంది.


