కాంగ్రెస్..బీజేపీ నాయకులు ఆందోళనలు
కేంద్రప్రభుత్వ దిష్టిబొమ్మను కాంగ్రెస్..
రాహుల్‌గాంధీ దిష్టిబొమ్మను బీజేపీ దహనం
దుబ్బాక: దుబ్బాక పట్టణంలో కాంగ్రెస్..బీజేపీ నాయకుల పోటాపోటీ ఆందోళనలతో బుధవారం ఉద్రిక్తత నెలకొంది. ఢిల్లీలో రాహుల్‌గాంధీ అరెస్టును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బస్టాండ్ వద్ద పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు ప్రధాన రోడ్డుపై బైఠాయించి ధర్నా, రాస్తారోకో చేపట్టారు. ప్రధానమంత్రి, కేంద్రమంత్రులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ నాయకులను పోలీసులు బలవంతంగా అక్కడినుంచి పంపించారు. ఈ క్రమంలోనే ఈ విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని రోడ్డుపై ఆందోళన చేపట్టారు. రాహుల్‌గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. దీంతో పోలీసులు వారిని కూడా అడ్డుకుని అక్కడి నుంచి పంపించివేశారు. కాంగ్రెస్, బీజేపీ నాయకుల పోటాపోటీగా ఆందోళనలతో పోలీసులకు వారిని కట్టడి చేయడం ఇబ్బందిగా మారింది. ఆందోళనలో కాంగ్రెస్ దుబ్బాక పట్టణ, మండల అధ్యక్షులు చంద్రారెడ్డి,నరేందర్‌రెడ్డి,ఏఎంసీ చైర్మన్ కొంగరి రవి,పీఏసీఎస్ వైస్ చైర్మన్ కాల్వ నరేశ్, నాయకులు మచ్చ శ్రీనివాస్, శ్రీరాం నరేందర్, కౌన్సిలర్లు తునికి సురేశ్ పాల్గొనగా బీజేపీ ఆందోళనలో రాష్ట్ర నాయకులు అంబటి బాలేష్‌గౌడ్, సుభాష్‌రెడ్డి, శ్రీకాంత్‌యాదవ్, ప్రవీణ్,రమణారెడ్డి,రమేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


