ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ హైమావతి
హుస్నాబాద్: ఎల్‌నినో ప్రభావం ఎదుర్కొనేందుకు ఆయా శాఖల అధికారులతో నిర్వహించనున్న సన్నాహక సమావేశానికి మూడు జిల్లాల కలెక్టర్లు హాజరు కానున్నట్లు సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి తెలిపారు. నియోజకవర్గంలోని ఏడు మండలాల వివిధ శాఖల అధికారులతో నిర్వహించే సమీక్ష ఏర్పాట్లను బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హైమావతి మాట్లాడుతూ...వివిధ శాఖల అధికారుల యాక్షన్ ప్లాన్ తెలపడం కోసం ప్రొజెక్టర్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అనంతరం ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినుల వసతి కోసం కేటాయించిన రైతు బజార్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో ఆర్డీఓ రామ్మూర్తి, కళాశాల అద్యాపకులు పాల్గొన్నారు.
చిత్రలేఖనంలో
పంచతంత్ర విద్యార్థి ప్రతిభ
చేర్యాల(సిద్దిపేట): స్థానిక పంచతంత్ర పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న విద్యార్థి భారతీశర్మ చిత్రలేఖన పోటీల్లో ప్రథమబహుమతి సాధించారు. ఈ మేరకు పాఠశాల ప్రిన్సిపాల్ బుధవారం విలేకరులకు వెల్లడించారు. బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన ద్విజబాలోత్సవం కార్యక్రమంలో భాగంగా జరిగిన చిత్రలేఖన పోటీల్లో భారతీశర్మ ఉత్తమ ప్రతిభ కనబర్చి మొదటి స్థానం కై వసం చేసుకోగా...హైదరాబాద్ నాంపల్లిలోని సురవరం ప్రతాప్‌రెడ్డి విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో బాలుడు బహుమతి అందుకున్నట్లు తెలిపారు. భారతీశర్మను పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు అభినందించారు.
పార్లమెంట్‌లో ప్రశ్నించండి
బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రసాదరావు
గజ్వేల్: పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు బాధ్యతగల ప్రతిపక్ష నాయకుడిగా సభలో సమస్యలను ప్రశ్నించాల్సిన రాహుల్‌గాంధీ ప్రధాని నివాసం ముందు నిరసనల పేరుతో డ్రామాలకు దిగడం ప్రజాస్వామ్యానికి పూర్తిగా విరుద్ధమని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కప్పర ప్రసాదరావు మండిపడ్డారు. గజ్వేల్‌లోని అంబేడ్కర్ చౌరస్తాలో రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ, మల్లికార్జునఖర్గేల చిత్రపటాలను బుధవారం దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ప్రసాదరావు మాట్లాడుతూ..నీట్ అంశంపై కేంద్ర ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉన్నా...మాట్లాడలేక పార్లమెంట్‌ను వదిలేసి రోడ్లపై నాటకాలు చేస్తున్నారన్నారు. ఢిల్లీలో జరుగుతున్న హింసాత్మక ఘటల వెనుక పెద్ద కుట్ర ఉన్నట్లు కనపడుతోందని ఆరోపించారు.
స్వేచ్ఛా వాణిజ్య
ఒప్పందాన్ని రద్దు చేయాలి
చేర్యాల(సిద్దిపేట): దేశంలో రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధర రాకుండా మన ఉత్పత్తులకు నష్టం కలిగించే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని వెంటనే రద్దు చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కొంగరి వెంకట్‌మావో కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పట్టణ కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని నిరసిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దిష్టిబొమ్మను బుధవారం దగ్ధం చేశారు. అనంతరం మాట్లాడుతూ..దేశంపై అనేక ఆంక్షలు విధిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం మన రైతులను నష్టపరిచే విధంగా ఉందన్నారు. ఈ ఒప్పందాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు రాజు, మైసయ్య, సిద్ధులు, నర్సింహ్మారెడ్డి, యాదగిరి, తిరుపతి, బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.


