ప్రిస్క్రిప్షన్.. పరేషాన్
మందుల కొరత
● ఏ గోలి ఎప్పుడు వేసుకోవాలో తెలియక రోగుల పాట్లు ● ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో తప్పని అవస్థలు ● వేధిస్తున్న పలు రకాల మందుల కొరత
ఏ మాత్రం పట్టించుకోని డాక్టర్లు
ఏ మెడిసిన్.. ఏ టైమ్‌కు తీసుకోవాలో తెలియక రోగులు తికమక పడుతున్నారు. సిద్దిపేటలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో డాక్టర్లు ప్రిస్క్రిప్షన్‌లో ఏ మందులు ఎప్పుడు తీసుకోవాలో రాయకపోవడంతో తిప్పలు తప్పడంలేదు. మరోవైపు పలు రకాల మందుల కొరత ఉండటంతో పూర్తిగా ఇవ్వడం లేదు. దీంతో బయటి దుకాణాలలో డబ్బులు వెచ్చించాల్సి వస్తోందని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
– సాక్షి, సిద్దిపేట
ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి.. మెడికల్ కళాశాలకు అనుబంధంగా కొనసాగుతోంది. ప్రతి రోజు సిద్దిపేట, దుబ్బాక, హుస్నాబాద్, కామారెడ్డి, మెదక్, సిరిసిల్లలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి దాదాపు ఓపీకి 1,100 నుంచి 1,200 మంది రోగులు వస్తుంటారు. రోగులకు ఇచ్చే ప్రిస్క్రిప్షన్‌లో ఏ మందులు ఎప్పుడు తీసుకోవాలో స్పష్టంగా రాయకపోవడం, మందులు ఇచ్చే కౌంటర్‌లో నోటి మాటగా చెప్పిన తర్వాత వాటిని మర్చిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డాక్టర్లు మెడిసిన్ పేర్లు మాత్రమే రాస్తుండటంతో ఉదయం, మధ్యాహ్నం, రాత్రి సమయాల్లో తీసుకోవాలో తెలియక తికమక పడుతున్నారు.
స్పష్టంగా రాయాలి
మందులు ఇచ్చే కౌంటర్‌లో మందులు ఎప్పుడు తీసుకోవాలో చెబుతున్నా.. ఆ తర్వాత రోగులు మర్చిపోతున్నారు. దీంతో ఇంటికి వెళ్లిన తర్వాత తలలు పట్టుకుంటున్నారు. చదువుకున్న వారు సైతం ఈ మందులు ఎప్పుడెప్పుడు తీసుకోవాలో చెప్పలేని పరిస్థితి నెలకొంది. కొందరు మందులు తప్పుగా వాడుతున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల త్వరగా జబ్బులు తగ్గే అవకాశాలు తక్కువగా ఉండనున్నాయి. మందులు రాసే సమయంలో డాక్టర్లైనా ఏ గోలీ ఎప్పుడు.. స్పష్టంగా రాసి ఇవ్వాలని రోగులు కోరుతున్నారు.
ఆస్పత్రిలో పలు రకాల మందులు అందుబాటులో లేకపోవడంతో పేద రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డాక్టర్లు పరిశీలించిన తర్వాత మందులు ఇచ్చే దగ్గరికి వెళ్లినా తర్వాత ట్యాబ్‌లెట్లు లేవని చెప్పడంతో నిరాశ చెందుతున్నారు. చిన్న పిల్లలకు ఐరన్ సీరప్‌లు, అలాగే బీపీకి సంబంధించిన మెటప్రోలర్ ఇలా పలు రకాల మెడిసిన్ అందుబాటులో లేకపోవడంతో ఆసుపత్రికి వచ్చే రోగులు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికై నా ఉన్నత అధికారులు స్పందించి అన్ని మెడిసిన్ అందుబాటులో ఉండే విధంగా, ప్రిస్క్రిప్షన్‌లో ఏ మెడిసిన్ ఎప్పుడు తీసుకోవాలో స్పష్టంగా రాయాలని రోగులు కోరుతున్నారు.
రాస్తే ఇబ్బంది ఉండదు
డాక్టర్లు రాసి ఇచ్చే ప్రిస్క్రిప్షన్‌లో ఏది ఎప్పుడు తీసుకోవాలి రాస్తే ఇబ్బంది ఉండదు. మెడిసిన్ ఇచ్చే దగ్గర చెబుతున్నా గుర్తుంచుకోవడం కష్టం. అదే రాసి ఇస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు.
–సుధీర్, సిద్దిపేట
అన్ని మందులు లేవు
మా బాబుకు కన్ను వాయడంతో ఆస్పత్రికి వచ్చాను. మెడిసిన్ రెండు రకాలు రాశారు. చిట్టీ తీసుకుని మెడిసిన్ ఇచ్చే దగ్గరికి వెళ్తే లేవన్నారు. దీంతో బయట కొనుగోలు చేశా. ఇప్పటికై నా అధికారులు అన్ని రకాల మెడిసిన్ అందుబాటులో ఉంచాలి.
– రవి, వెలికట్ట
డాక్టర్లకు సమాచారం అందిస్తాం
ప్రిస్క్రిప్షన్‌లో రాసే మెడిసిన్ కిందనే ఏది ఎప్పుడు తీసుకోవాలో పేర్కొనాలని డాక్టర్లకు సమాచారం అందిస్తాం. అన్ని మెడిసిన్ అందుబాటులో ఉండే విధంగా చూస్తాం. ఒకటి రెండు మెడిసిన్ తప్ప అన్ని అందుబాటులో ఉన్నాయి.
– డాక్టర్ జ్యోతి, ఆర్‌ఎంఓ


